బీజేపీ-జనసేన పొత్తుపై.. చంద్రబాబు మౌనం వెనుక వ్యూహమేమిటో!?

chandrababu-naidu-with-tdp-leaders
- Advertisement -

అమరావతి: బీజేపీ-జనసేన మధ్య కుదిరిన పొత్తుపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మౌనం వహించడం వెనుక ఆయన వ్యూహం ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఈ సరికొత్త మార్పుపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దంటూ తన పార్టీ శ్రేణులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేయడం కూడా విస్మయం కలిగిస్తోంది.

చదవండి: అమరావతి ఇష్యూ: వైసీపీ చెబుతున్నది అబద్ధం.. భారీ షాకిచ్చిన మద్రాస్ ఐఐటీ

అయితే ఈ పొత్తు వల్ల నష్టపోయేది టీడీపీ కాదని, దీని ప్రభావం ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పరోక్షంగానూ, ఆయన పార్టీపై ప్రత్యక్షంగానూ పడుతుందని టీడీపీ అధినేత భావిస్తోన్నట్లు తెలుస్తోంది. బీజేపీ-జనసేన పొత్తు కచ్చితంగా వైసీపీ అధినేతకు లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయమని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో గురువారం జరిగిన పార్టీ నేతల సమావేశంలో బీజేపీ-జనసేన పొత్తు అంశం ప్రస్తావనకు రాగా.. చంద్రబాబునాయుడు మాత్రం ప్రస్తుతానికి ఈ విషయంపై మౌనం వహించడమే మంచిదని పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. 

‘‘రెండు రకాలుగా జగన్‌కే ఇబ్బంది..’’

ఒక్క రాజధాని విషయంలోనే కాకుండా, వ్యక్తిగతంగా కేసులకు సంబంధించి కూడా జగన్‌కు చిక్కులు తప్పవని, ఆయనకు ఇప్పటి వరకు బీజేపీ నుంచి అందిన సహకారం ఇకమీదట అందకపోవచ్చని.. కాబట్టి ఈ సమయంలో మనం మాట్లాడేకంటే.. మౌనం వహిస్తూ మున్ముందు ఏం జరగబోతుందో చూడడమే మంచిదని చంద్రబాబు పార్టీ నేతలతో అన్నట్లు సమాచారం.

అంతేకాదు, రాజధాని అమరావతి విషయంలో అన్ని పార్టీలు కలిసి ఆందోళన చేస్తున్న ఈ దశలో.. మున్ముందు బీజేపీ-జనసేన కలిసి ఉద్యమించే అవకాశాలు కూడా ఉన్నాయని, అదేగనుక జరిగితే.. అమరావతి తరలింపుపై బీజేపీ కూడా వ్యతిరేకతతో ఉన్నట్లే అర్థమని ఆయన వ్యఖ్యానించినట్లుత తెలుస్తోంది.

చదవండి: కలవకుండానే కలిశామంటారా?: వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై మందడం మహిళలు ఫైర్

ఒకవేళ బీజేపీ గనుక ఉద్యమబాట పడితే.. రాజధానిని అమరావతి నుంచి తరలించడం జగన్‌కు చాలా కష్టతరం అవుతుందని,   కాబట్టి ఈ పరిస్థితులలో బీజేపీ-జనసేన పొత్తుపై లేనిపోని వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఆ ప్రభావం అమరావతి ఉద్యమంపై పడే ప్రమాదముందని కూడా ఆయన నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. 

- Advertisement -