విజయవాడ: సీబీఐని నిరాకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని, ఈ విషయంలో కోర్టులు కూడా ఏమీ చేయలేవని న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కారు సీబీఐకి సాధారణ అనుమతిని ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్ శుక్రవారం మాట్లాడుతూ ఢిల్లీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం సీబీఐని నిరాకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలిపారు.
సీబీఐ కంటే ఏపీ ఏసీబీకే మంచి పేరు ఉందని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విచారణలో ఏసీబీ గొప్పగా పని చేస్తోందని… రాష్ట్ర ఏసీబీ పనితీరును ఐటీ, సీబీఐలు కూడా ప్రశంసించాయని న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్ అన్నారు. ఐటీ అధికారులు కూడా ఏసీబీ నుంచి వివరాలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై దర్యాప్తు చేసే సామర్థ్యం కూడా ఏసీబీకి ఉందని… ఆ మేరకు సంబంధిత సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఏసీబీ ఎప్పుడో సమకూర్చుకుందని ఆయన పేర్కొన్నారు.
మసకబారిన సీబీఐ ప్రతిష్ట, అందుకే…
ప్రస్తుతం సీబీఐ ప్రతిష్ట మాసకబారిందని… సీబీఐ కార్యాలయాల్లో సీబీఐ అధికారులే దాడులు చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో సీబీఐని నిరాకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని ఎర్నేని వేదవ్యాస్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఐటీ, ఈడీలను తన రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తుండడం అందరికీ తెలిసిందేనన్నారు.
బాధ్యత కలిగిన ఒక భారత పౌరుడిగా, విజయవాడ న్యాయవాదిగా తన వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చానని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా… న్యాయపరంగా ఎదుర్కోవడానికి తాను సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు.