ఖమ్మం జిల్లా తల్లంపాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

8:24 am, Tue, 10 September 19

ఖమ్మం: జిల్లాలోని తల్లంపాడు వద్ద సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా, మరో డ్రైవర్‌తోపాటు ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

తాండూరు డిపోకు చెందిన హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా, ఏలూరు డిపోకు చెందిన బస్సు ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్తోంది. ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు బస్సులు తల్లంపాడు వద్ద బలంగా ఢీకొన్నాయి.

దీంతో రెండు బస్సుల డ్రైవర్లు క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ఏలూరు బస్సు డ్రైవర్ కిరణ్ (40) ప్రాణాలు కోల్పోయాడు.

తాండారూ డిపో బస్సు డ్రైవర్ జంగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. రెండు బస్సుల్లో కలిపి మొత్తం 80 మంది ప్రయాణికులుండగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.