షాకింగ్: అందరూ చూస్తుండగా.. టీవీ లైవ్‌లో ఇరగ కుమ్మేసుకున్న నేతలు!

- Advertisement -

ఇస్లామాబాద్: సాధారణంగా టీవీ చర్చల్లో ఆవేశ కావేశాలు కనిపిస్తాయి. రెండు పార్టీల నేతలో, లేదంటే రెండు వర్గాల మధ్యో జరిగే డిబేట్‌ ఉద్రిక్తంగా మారిన సందర్భాలు అనేకం. కొన్నిసార్లు శ్రుతిమించి లైవ్‌లోనే పరస్పరం తోసుకున్న ఘటనలను కూడా చూశాం.

అయితే, ఇది మాత్రం కొంచెం వెరైటీ. ఓ చర్చా కార్యక్రమంలో ఇద్దరు నేతల మధ్య పెరిగిన మాటామాట చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం వరకు వెళ్లింది. అయితే, ఇది ఇక్కడ కాదు. పాకిస్తాన్‌లో.

ఇంతకీ ఏం జరిగిందంటే…

‘న్యూస్‌లైన్ విత్ ఆఫ్తాబ్ ముఘేరీ’ అనే చర్చా కార్యక్రమంలో అధికార తెహ్రీక్-ఇ-ఇన్సాన్ (పీటీఐ) పార్టీ సీనియర్ నేత మన్సూర్ అలీ సియాల్-కరాచీ ప్రెస్‌ క్లబ్ అధ్యక్షుడు ఇంతియాజ్ ఖాన్ ఫరాన్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిని మన్సూర్ అలీ తీవ్రంగా ఖండించారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వివాదానికి దారితీసింది.

అయినప్పటికీ ఇంతియాజ్ విమర్శలు ఆపకపోవడంతో తన సీట్లో నుంచి లేచి నిల్చున్న మన్సూర్ అలీ ఒక్కసారిగా ఇంతియాజ్‌ను పట్టుకుని ఎత్తి కుదేశారు. దీంతో ఆయనా వెంటనే రియాక్టయ్యారు. అంతే.. ఇక తోపులాటలు, ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం జరిగిపోయింది.

ఇదంతా లైవ్‌లోనే జరుగుతుండడంతో చూస్తున్న ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇక, నేతలిద్దరినీ విడిపించేందుకు ప్రయత్నించిన టీవీ చానల్ సిబ్బంది కూడా చేష్టలుడిగి చూస్తుండడం తప్ప ఏమీ చేయలేకపోయారు. అయితే, ఆ తర్వాత కాసేపటికి వివాదం సద్దుమణిగింది.

ఈ ఘటన తర్వాత ఇంతియాజ్ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, మన్సూర్ మాత్రం చర్చను కొనసాగించారు. మహిళా ఫ్రీలాన్స్ జర్నలిస్టు నైలా ఇనాయత్ నేతల ఫైటింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.

‘నయా పాకిస్తాన్ అంటే దాడి చేయడమేనా?’ అని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. అయితే, లైవ్ డిబేట్‌లో కొట్టుకోవడం పాకిస్తాన్‌లో  కొత్తకాదని, ఇటీవల కూడా ఇలా లైవ్‌లో ఇద్దర నేతలు బాదేసుకున్నారని ‘వాయిస్ ఆఫ్ కరాచీ’ అనే హక్కుల సంస్థ గుర్తు చేసింది.

- Advertisement -