కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.. మరో పది మంది గాయపడ్డారు. టాటా మ్యాజిక్ ఆటోను టిప్పర్ లారీ బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం ధాటికి ఆటో నుజ్జయిపోయింది. మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో డ్రైవర్‌తో కలిపి 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
గృహ ప్రవేశానికి వెళ్లి వస్తుండగా…
విశాఖపట్నం జిల్లా మాకవరంపాలేం జి కుండూరుకు చెందిన కొంత మంది టాటా ఏస్ వాహనంలో కాకినాడలో ఓ గృహ ప్రవేశం వేడుకకు హాజరయ్యారు. అక్కడ బంధుమిత్రులందరితో ఆహ్లాదంగా గడిపిన అనంతరం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు.
గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. 216 జాతీయ రహదారిపై చేబ్రోలు గ్రామ శివారు బైపాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ రాంగ్ రూట్‌లో వచ్చి వేగంగా ఢీకొనడంతో టాటా మ్యాజిక్ ఆటో ఎగిరి మూడు పల్టీలు కొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఆరుగురు మహిళలతోపాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో పది మందిని మొదట స్థానిక ఆస్పత్రికి, అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.