విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నేడు బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్ఈసీగా నియమితులైన ఆమెకు కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు.
ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం మార్చి 31తో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు.
రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రతిపాదించగా నీలం సాహ్నిని పేరును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఖరారు చేశారు. ఐదేళ్లపాటు ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాహ్ని మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎస్ఈసీ బాధ్యతలు అప్పగించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో ఎన్నికలను నిర్వహిస్తామని సాహ్ని అన్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కసరత్తు
మరోవైపు, నీలం సాహ్ని ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కసరత్తుకు రెడీ అయ్యారు. మరికాసేపట్లో ఆమె సీఎస్ ఆదిత్యనాద్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్‌తో సమావేశం కానునున్నారు. ఈ నెలలో 17లోగా ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆలోచనలో ఎస్ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై అధికారులతో సాహ్ని చర్చించనున్నారు. 8న ఎన్నికలు నిర్వహించి 10న ఫలితాలు వెల్లడించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించనున్నట్టు సమాచారం. ఆగిన చోటి నుంచే ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తైన విషయం తెలిసిందే.