ఏపీలో త్వరలో మీ సేవా కేంద్రాలు బంద్?

2:02 pm, Sun, 11 August 19

అమరావతి: ఏపీలో త్వరలో మీ సేవా కేంద్రాలను మూసివేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గ్రామ సచివాలయాల రాకతో ఈ పెనుమార్పులు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది.

దీంతో ఇప్పటివరకూ ఈ సేవలను అందించే మీ సేవా కేంద్రాలు మూతపడే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే దీనిపై ప్రభుత్వ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రామాల్లో సచివాలయాల రాకతో ప్రభుత్వ సేవలన్నీ ఇకపై ఏకీకృతం కానున్నాయి. ప్రస్తుతం వివిధ ధృవపత్రాలు, బిల్లు చెల్లింపులు మీసేవా లభిస్తున్నాయి.

ఇక నుంచి ఇవి గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు దగ్గరగా రావడంతో ప్రజలు దీనిపై మొగ్గుచూపే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఓటరు కార్డులు, రేషన్‌ కార్డులు, రేషన్ పంపిణీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇలా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలూ సచివాలయాల్లోనే అందుబాటులోకి రానున్నాయి.

ఫలితంగా ఇప్పటివరకూ ఆయా సేవలకు కేంద్రంగా ఉన్న మీసేవా సెంటర్లు మూతపడే అవకాశం ఉంది. మీసేవా సెంటర్లలో సిబ్బంది కొరత, నాణ్యతా లోపం కూడా తలెత్తుతుండటం, సత్వరంగా పనులు జరగపోవడం వంటివి ప్రజలకు తలనొప్పిగా మారాయి. దీంతో గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలే లభిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.