సీట్లు కాదు.. ప్రజాకూటమి అధికారంలోకి రావడం ముఖ్యం: టీ-టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ttdp-ramana-chandrababu-naidu
- Advertisement -

అమరావతి: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి సీట్లు ముఖ్యం కాదని, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన ప్రజాకూటమి అధికారంలోకి రావడం ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికల వ్యూహాలు, మహాకూటమిలో సీట్ల సర్దుబాటు తదితర విషయాలపై గురువారం ఉదయం అమరావతిలో తనను కలిసిన టీ-టీడీపీ నేతలకు బాబు ఇదే చెప్పారు. టీటీడీపీ చీఫ్ ఎల్.రమణ నేతృత్వంలో పలువురు నాయకులు చంద్రబాబును కలిశారు.

తెలంగాణలో పోటీ చేయనున్న సీట్లు, అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబునాయుడితో చర్చించిన అనంతరం టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా దేశమంతా ప్రతిపక్షాలను ఏకం చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా ఈ రోజు చంద్రబాబుతో కలిసి బెంగళూరుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.

అంతేకాదు, రాబోయే ఎన్నికల్లో ప్రజాకూటమి గెలుపు తమకు ముఖ్యమని చెబుతూ, టీడీపీ కచ్చితంగా రెండు అంకెల సీట్లను గెలుచుకుంటుందనే ధీమాను వ్యక్తం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థుల విజయమే ముఖ్యమని రమణ వ్యాఖ్యానించారు. ఒకటి రెండు రోజుల్లో తుది జాబితా, అభ్యర్థుల పేర్లపై స్పష్టత వచ్చే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు, టీటీడీపీ నేతలతో మాట్లాడుతూ.. ప్రజాకూటమిలో 14 కంటే ఎక్కువ సీట్లను కోరితే ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో పోటీ చేయడం ముఖ్యం కాదనీ, ప్రజాకూటమి అధికారంలోకి రావడం ముఖ్యమని, ఆ దిశగా కృషి చేయాలని కూడా ఆయన తెలంగాణ నేతలకు సూచించినట్లు సమాచారం.

- Advertisement -