జనసేనలోకి కేవీ విష్ణురాజు: కీలక పదవి అప్పగించిన పవన్ కళ్యాణ్

janasena

అమరావతి: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలో చేరికలు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా, జనసేన పార్టీలో ప్రముఖ విద్యావేత్త కేవీ విష్ణు రాజు మంగళవారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విష్ణురాజుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. భీమవరంలోని డాక్టరు బీవీ రాజు ఫౌండేషన్ చైర్మన్ అయిన విష్ణురాజుని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని తెలిపారు. ఆయన తమ కళాశాలను నడిపే విధానం తనను అమితంగా ఆకట్టుకుందని అన్నారు. పాలసీ మేకింగ్, పార్టీకి దిశానిర్దేశం విషయంలో గానీ తన పాత్ర ఉంటుందని విష్ణు రాజు చెప్పడంతో పార్టీలోకి ఆహ్వానించానని చెప్పారు.

విష్ణురాజుకు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్

అంతేగాక, జనసేన పార్టీ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్మన్‌గా విష్ణురాజుని నియమిస్తున్నట్టు ప్రకటించారు పవన్. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి కేవీ విష్ణురాజు అని అన్నారు. విష్ణురాజు లాంటి వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ ని ప్రశంసిస్తున్నానని మనోహర్ అన్నారు. పార్టీ అభివృద్ధికి విష్ణురాజు తోడ్పడతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రం కోరుకుంటే మంచి మార్పు తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. రెండు, మూడు సార్లు పవన్ కళ్యాణ్ ని కలిశానని, సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన ఆయనకు ఉందని విష్ణు రాజు అన్నారు. పవన్ కళ్యాణ్ పాలసీ, ఫిలాసపీ తనకు బాగా నచ్చిందని, పవన్, జనసేన టీంకు తాను పూర్తిగా సహకరిస్తానని, పార్టీకి అవసరమైన రీతిలో పనిచేస్తానని ఆయన చెప్పారు.