చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ల భేటీపై డీఎంకే నేత, ఎంపీ కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి భేటీతో బీజేపీ నాయకుల గుండెల్లో దడ ప్రారంభమైందని, మతశక్తులను వెనుక ఉండి నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పాలకు ఇక చరమగీతం పాడాల్సిందేనని ఆమె వ్యాఖ్యానించారు.
ఎన్డీయే పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, మోడీ పాలనకు చెక్ చెప్పేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు కచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయని, ఇప్పటికే కమలనాథుల గుండెల్లో వణుకు ప్రారంభమైందని డీఎంకే నేత కనిమొళి అన్నారు.
సమయం ఆసన్నమైంది…
అంతేకాదు, భారత దేశంలో లౌకికవాదాన్ని కాపాడే సమయం ఆసన్నమైందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. రాజకీయ పార్టీలన్నీ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ఒకే వేదిక పైకి రావాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
శనివారం స్టాలిన్‌ను కలిసిన తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల కేంద్ర పరిశీలకుడు సంజయ్‌దత్ కూడా విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చొరవతో ఎన్డీయే వ్యతిరేక కూటమి ఏర్పాటు జరగబోతోందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ కూటమి ఏర్పాటు కోసం త్వరలోనే తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలవబోతున్నట్టు చెప్పారు.
చదవండి: చంద్రబాబు చెన్నై టూర్: స్టాలిన్, కనిమొళిలతో భేటీ.. చర్చలు, పూర్తిగా సహకరిస్తానన్న స్టాలిన్