అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఎన్నికలని ఎదుర్కొన్న వైసీపీ నేతలు కచ్చితంగా అధికారంలోకి వచ్చేది తామేనని నమ్మకంతో కనిపిస్తున్నారు.
రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఉన్న క్రేజ్ దృష్ట్యా అధికారం వైసీపీదే అని అంచనాలు వేస్తున్నారు. ఈ ఎన్నికలలో దాదాపుగా 120 పైగా ఎమ్మెల్యే సీట్లని గెలుచుకొని , అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తమ పార్టీ అధినేత పోలింగ్ ముగిసిన వెంటనే మాట్లాడిన తీరుని బట్టి చూస్తే , అధికార పగ్గాలు తమవే అనే భరోసాతో కనిపిస్తున్నారు వైసీపీ కీలక నేతలు. ఇక అధికారంలోకి వచ్చేది తామే కాబట్టి మంత్రులు ఎవరు , పార్టీలోని కీలక పదవులు ఎవరికీ దక్కనున్నాయి అనేది కూడా ఇప్పటినుండే అంచనాలు వేసుకుంటున్నారు.
ఇందులో భాగంగా జిల్లాల వారీగా , సామజిక వర్గాల వారీగా లెక్కలు వేస్తూ ,పలానా వారికీ మంత్రి వస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి.
అంతే కాకుండా ఎవరైనా మంత్రి పదవులు ఆశిస్తున్నారో , వారిలో కొందరు తమకి అనుకూలమైన అధికారులని , తమకి సంబందించిన శాఖలో వేయించుకునేందుకు ఉన్నత అధికారులతో చర్చలు కూడా జరుపుతున్నారు.
మంత్రి పదవులు ఖాయం అని ఫిక్స్ అయిపోయిన నేతలు పిఏ లు , pro లుగా ఎవరిని పెట్టుకోవాలో కూడా అప్పుడే సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పదవి వచ్చాక అన్ని సర్దు కోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి , ఇప్పటినుండే సిబ్బందిని సమకూర్చుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది.
ఈ వ్యవహారం కాస్త అధినేత జగన్ దృష్టికి చేరడంతో , మంత్రులుగా ప్రచారం చేసుకుంటున్న వారికీ స్వయంగా కాల్స్ చేసి క్లాస్ తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.
ఇక అధికారంలోకి రాబోతోన్న తరుణంలో పార్టీ నేతలు మరింత హుందాగా వ్యవహరించాలని, ప్రజలకి ఎలా మేలు చేయాలో ఆలోచన చేయాలి కానీ, ఇలా పదవుల కోసం పాకులాడద్దు అని హితవు పలికినట్టు తెలుస్తోంది.