షాకింగ్: సుజనా చౌదరిపై లుకౌట్ నోటీసు జారీ, టీడీపీ వర్గాలలో టెన్షన్…

- Advertisement -

sujana-ed-raidsహైదరాబాద్/అమరావతి: మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరికి కేంద్రం తాజాగా పెద్ద షాకే ఇచ్చింది. ఆర్దిక లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలపై సుజనా చౌదరి ఇళ్ళు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు జరుపుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి మొదలైన ఈ సోదాలు ఇంకా జరుగుతున్నాయి.

అంతేకాదు, ఈ క్రమంలో ఈడీ అధికారులు సుజనా చౌదరిపై లుకౌట్ నోటీసు జారీ చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా పెద్ద నేరాలకు పాల్పడిన నిందితులు దేశం వదిలి పారిపోయే అవకాశం ఉన్నట్లు అనుమానం వచ్చినా, లేదా ఎవరికీ కనిపించకుండా అజాతంలోకి వెళ్ళిపోయినా లుకౌట్ నోటీసు జారీ చేస్తారు. అలాంటిది.. హఠాత్తుగా సుజనా చౌదరిపై ఈ తరహా నోటీసు ఎందుకు జారీ చేశారన్నది అర్థంకాని విషయంగా మారింది.

కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, సెంట్రల్ బ్యాంకు నుండి సుమారు 304 కోట్ల రూపాయలు తీసుకుని సుజనా చౌదరి ఎగవేశారని, అంతేకాకుండా.. ఆ మొత్తాన్ని ఆయన డొల్ల కంపెనీలు పెట్టి వాటిలోకి మళ్ళించారని ఆరోపణలున్నాయి. తన ఉద్యోగుల్లో కొందరిని ఆ డొల్ల కంపెనీలకు డైరెక్టర్లుగా చూపిస్తున్న విషయం కూడా అధికారులకు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే ఆయన ఇళ్లపై, కార్యాలయాలపై తాజాగా ఈడీ దాడులు జరిగాయి. ఈ సోదాల్లో ఈడీ అధికారులు కీలకమైన పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దాడుల్లో సుజనా చౌదరికి చెందిన లగ్జరీ కార్లను కూడా అధికారులు సీజ్ చేయటం గమనార్హం.

నిజానికి సుజనా చౌదరికి చెందిన కంపెనీలలో ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సీబీఐ 2016 ఫిబ్రవరిలోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఇదే విషయమై గతంలో.. అంటే.. సుజనా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే నాంపల్లి కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు కూడా జారీ చేసింది.

ఇంతటితో ఆగుతుందా? అరెస్టు కూడా ఉంటుందా??

ఎన్‌బీడబ్ల్యూ జారీ, ఈడీ దాడులు, విచారణ.. ఇవన్నీ మామూలే అనుకున్నా.. ఈ లుకౌట్ నోటీసు జారీ చేయడం అనేది కాస్త తేడాగా ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఇలా నోటీసులు జారీ చేయటం, ఆయన కార్లను స్వాధీనం చేసుకోవడం వంటివి కూడా గతంలో ఎన్నడూ జరగనివి.

ఇంతకాలానికి ఈ తరహా చర్యలు మొదలయ్యాయంటే.. బహుశా సుజనా చౌదరిని త్వరలోనే అరెస్టు కూడా చేస్తారేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు సుజనా చౌదరి సంస్థలపై జరుగుతున్న ఈడీ దాడులు, కార్ల స్వాధీనం, లుకౌట్ నోటీసు జారీ .. ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోన్న తెలుగు దేశం పార్టీ అధిష్ఠానంలో, ఆ పార్టీ నాయకుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

- Advertisement -