‘బాబ్లీ ప్రాజెక్టు’ కేసులో చంద్రబాబుకు ఊరట.. 15న వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు

chandra-babu
- Advertisement -

chandrababu

అమరావతి: ‘బాబ్లీ ప్రాజెక్టు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ న్యాయస్థానంలో ఊరట లభించింది. చంద్రబాబుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కల్పిస్తూ ధర్మాబాద్ న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

మహారాష్ట్రలో నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టకు వ్యతిరేకంగా 2010లో ఆందోళనలు చేసిన కేసులో సీఎం చంద్రబాబుకు ఇటీవల ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్మాబాద్ కోర్టుకు హాజరయ్యే అంశాన్ని తొలుత చంద్రబాబు పరిశీలించారు. అయితే అధికారులు, సన్నిహిత వర్గాల సూచన మేరకు రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు.

గంటన్నర సేపు వాదనలు…

దీంతో ఢిల్లీ నుంచి మహారాష్ట్ర చేరుకున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, మరో న్యాయవాది సుబ్బారావు.. చంద్రబాబు తరఫున రెండ్రోజుల క్రితం ధర్మాబాద్ కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఇరు పక్షాలు గంటన్నర సేపు కోర్టు ముందు తమ వాదనలు వినిపించాయి.

ఇరుపక్షాల వాదనలను సావధానంగా విన్న ధర్మాబాద్ కోర్టు జడ్జి ఈ నెల 15న జరిగే విచారణకు చంద్రబాబు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదని, అయితే వచ్చే నెల 3వ తేదీన జరిగే విచారణకు మాత్రం హాజరు కావాల్సి ఉంటుందని చెప్పగా నవంబర్ 3న కూడా చంద్రబాబు వ్యక్తిగతంగా హాజరు కాలేరని సీనియర్ న్యాయవాది లూథ్రా కోర్టుకు విన్నవించారు. మరి ఆరోజున ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!

- Advertisement -