సీఎస్ వర్సెస్ సీఎం! చంద్రబాబు, ఎల్వీ వార్ ఎప్పటివరకు?

11:04 am, Sat, 4 May 19
Chandrababu Naidu Varthalu, AP Latest News, CS Latest News, Newsxpressonline

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ఏపీకి చీఫ్ స్రెక్రటరీగా వచ్చిన ఎల్వీ సుబ్రమణ్యంతో.. సీఎం హోదాలో ఉండీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా తన అధికారాలను చలాయించలేకపోతున్న చంద్రబాబుకు జరుగుతున్న వార్ గురించి కొత్తగా వివరించనక్కర్లేదు.

ఎల్వీ సుబ్రమణ్యంకు సీఎస్‌గా ఉండే అర్హతే లేదు అని పోలింగ్ రోజున చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంతో మొదలైన ఈ మాటల యుద్దం  ఆ తరువాత కూడా కొనసాగుతూనే ఉంది.

వివాదాస్పదమైన బాబు వ్యాఖ్యలు…

ఎల్వీ సుబ్రమణ్యంను కేసుల్లో ఉన్న వ్యక్తి అని చంద్రబాబు నాయుడు అనడం వివాదాస్పదం అయ్యింది. దానిపై ఎల్వీకి మాజీ ఐఏఎస్‌లు కూడా అండగా నిలిచారు. చంద్రబాబు మాటలను వాళ్లంతా ఖండించారు కూడా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడకపోయినా.. మొత్తానికి సీఎస్ ఎల్వీపై ఒక రేంజ్‌లో ఆగ్రహంతో అయితే ఉన్నారు.

ఇక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎల్వీ సుబ్రమణ్యం కూడా పక్కాగా నియమాలను అమల్లో పెడుతూ బాబును మరింత ఇరకాటంలో పెడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షకు హాజరైన అధికారులకు నోటీసులు ఇవ్వడంతో మొదలుకుని ఎల్వీ కూడా బాబు విషయంలో పక్కా రూల్స్ ప్రకారం వ్యవహరిస్తూ ఉన్నారు.

చదవండి:  చంద్రబాబుకి హ్యాండ్ ఇచ్చిన సీఎం రమేష్! ఆపద్భాంధవుడు ఎవరు?

ఇది చంద్రబాబు నాయుడి ఇగోను దారుణంగా దెబ్బ తీస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎంకు పవర్స్ ఉండవన్నట్టుగా సీఎస్ చేసిన వ్యాఖ్యలు కూడా బాబును మరింత అసహనానికి గురి చేస్తూ ఉన్నాయి.

తనకు సమీక్షల అధికారం ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినా అది బుట్టదాఖలే అయ్యింది. అయితే తుఫాన్ నేపథ్యంలో ఏపీలో పాక్షికంగా ఎన్నికల కోడ్ కు మినహాయింపును ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు వేరే టార్గెట్ ఏమీ లేదని.. ఎల్వీ సుబ్రమణ్యమే టార్గెట్ అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తూ ఉన్నారు. అయితే మరో ఇరవై రోజుల్లో ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి. అప్పుడు ఎవరేమిటనే అంశంపై పూర్తి స్పష్టత వస్తుంది.

మరి అంత వరకూ సీఎస్ వర్సెస్ సీఎం పోరు తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీల తీరు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది అనేది డైలీ సీరియల్‌లా, వార్తల్లోని అంశంగా నిలిచేలా ఉంది.

చదవండి:  వైఎస్ జగన్‌ లండన్‌ పర్యటన రద్దు! కారణం ఏమిటి ?