అమరావతి, హైదరాబాద్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ చింతా మోహన్

1:34 pm, Tue, 10 September 19

అమరావతి: నవ్యాంధ్ర రాజధానిపై అమరావతిపై మాజీ ఎంపీ చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా తిరుపతి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతిని వదిలి తిరుపతికి రావాలని కోరారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుపతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని చింతా మోహన్ గతంలోనూ డిమాండ్ చేశారు. మరోవైపు, ఏపీ రాజధాని అమరావతిపై మంత్రులు చేస్తున్న ప్రకటనలు పరస్పరం విరుద్ధంగా ఉండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

మరోవైపు, రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకు ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం కూడా అనుమానాలు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో చింతా మోహన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.