మోడీకి కౌంటర్: ఢిల్లీలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష, మాట మార్చడంపై వామపక్షాల ఝలక్

10:42 am, Mon, 11 February 19
22
cbn deeksha

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ ఢిల్లీలో సోమవారం ఉదయం ధర్మపోరాట దీక్షను చేపట్టారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అన్నారు.

‘ఎప్పుడైతే పాలకులు, పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, అదే విధంగా ఒక రాష్ట్రం పట్ల, ఒక ప్రాంతం పట్ల వివక్ష చూపించినప్పుడు, అన్యాయం చేసినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఆ న్యాయ పోరాటం కోసమే మనమందరం ఇక్కడకు వచ్చాం. ఈరోజు చలిని కూడా లెక్కబెట్టకుండా మహాత్మాగాంధీ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించి, అంబేద్కర్ కు నివాళులు అర్పించి, ఎన్టీఆర్ ఆత్మ సాక్షిగా మనందరం ఇక్కడ సమావేశమయ్యే పరిస్థితికి వచ్చాం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చదవండి: వెన్నుపోటులో చంద్రబాబే సీనియర్!: ఏపీ సీంను ఏకిపారేసిన మోడీ, ‘తండ్రీకొడుకులు దిగిపోవాల్సిందే’…

తాను న్యూఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష తలపెడితే, అందుకు ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారని, ఆ అవసరం ఇప్పుడేమొచ్చిందని ప్రశ్నించారు. విభజన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదాను ప్రకటిస్తే, నాటి విపక్ష నేత, నేటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, నాటి ఎంపీ, నేటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదేళ్లు హోదా కావాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారు హోదా ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు నిలదీశారు.

రాష్ట్రంలో వస్తున్న ఆదాయం ఖర్చులకు సరిపోవడం లేదని, రూ. 16 వేల కోట్ల లోటులో రాష్ట్రం ఉందన్నారు. అయితే, కేంద్రం కేవలం రూ. 3,900 కోట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ’ఇప్పటికైనా మూడు రోజుల టైముంది.. ఇది తప్పని పార్లమెంటులో అంగీకరిస్తే తెలుగు ప్రజలు క్షమిస్తారు.. చేయకపోతే ఏపీ ప్రజానీకం శాశ్వతంగా బీజేపీని బహిష్కరిస్తారు. ఏపీ చరిత్రలో బీజేపీ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయే పరిస్థితి వస్తుంది’ అని చంద్రబాబు హెచ్చరించారు.

ఏపీ భవన్ వేదికగా నల్లచొక్కాతో చంద్రబాబు దీక్ష

ఎన్డీయే మధ్యంతర బడ్జెట్‌లోనూ ఏపీకి మొండిచెయ్యి చూపడంతో సీఎం చంద్రబాబు ఈ సారి ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేయాలని నిర్ణయించారు. దీంతో దేశరాజధానిలోని ఏపీ భవన్‌ వేదికగా సోమవారం ఉదయం దీక్షను ప్రారంభించారు. నల్లచొక్కాతో దీక్షకు హాజరయ్యారు.

అంతకుముందు సీఎం చంద్రబాబు రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. ఏపీ భవన్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. దీక్షా వేదికపై గాంధీ, అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ చిత్ర పటాలకు చంద్రబాబు నివాళులర్పించారు. రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. అనంతరం చంద్రబాబు ప్రసంగించనున్నారు.

వామపక్షాల ఆగ్రహం: చంద్రబాబు దీక్షకు దూరం

చంద్రబాబు తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నామని ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ స్పష్టం చేశారు. హోదా కోసం ఆందోళన చేసినప్పుడు తమ పార్టీల కార్యకర్తలను చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో కొట్టించి కేసులు పెట్టించిందని గుర్తు చేశారు. అప్పుడు పెట్టిన కేసులు ఇంతవరకు ఎత్తివేయలేదని, తమ కార్యకర్తలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

ప్రభుత్వ పెద్దలు కొందరు తమను దీక్షకు ఆహ్వానించిన మాట నిజమేనని, తాము రాలేమని స్పష్టం చేసినట్టు తెలిపారు. పోరాటం చేయాల్సిన సమయంలో చేయకుండా మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో చంద్రబాబు చేస్తున్న హడావిడి రాజకీయ ప్రయోజనం కోసమేనని సీపీఐ, సీపీఎం తీవ్రంగా ఆక్షేపించాయి. సీఎం అప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించకుండా హోదాయే కావాలని పోరాటానికి దిగి ఉంటే అంతా మద్దతు పలికేవారమంటున్నాయి.

మోడీ వర్సెస్ చంద్రబాబు

ఇది ఇలా ఉండగా, ఆదివారం గుంటూరులో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోడీ చేసిన విమర్శలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. గాంధీలా చాలా సాధారణ జీవితం గడుపుతున్న తనపై ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి ఆరోపణలు చేస్తారా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘40 ఏళ్లుగా ఒకేరకం బట్టలు వేసుకుంటున్నాను. ఎక్కడకు వెళ్లినా వేషం మార్చడం లేదు. సూట్లు వేసుకోవడం లేదు. ఈ రోజు ప్రజల కోసం నల్ల చొక్కా వేసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

‘నేను వస్తున్నప్పుడు దారి పొడవునా మోడీ గో బ్యాక్ అన్న నినాదాలతో పోస్టులు కనిపించాయి. నేను కచ్చితంగా మళ్లీ వెనక్కు వెళతాను. ప్రధానిగా న్యూఢిల్లీకి వెళతాను’ అని మోడీ వ్యాఖ్యానించగా.. ‘గో బ్యాక్ అంటే మోదీకి అర్థం తెలియదనుకుంటా. మిమ్మల్ని ఢిల్లీలో చూడాలని కాదు… తిరిగి గుజరాత్ కు వెళ్లాలని’ అంటూ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.

‘కాంగ్రెస్ విముక్త రాష్ట్రం కావాలంటూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు అదే కాంగ్రెస్ తో జత కట్టారు. దీన్ని చూసిన ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది’ అని మోడీ విమర్శించగా.. ‘నాడు కాంగ్రెస్ దురహంకారంతో వ్యవహరించడంతో ఎదుర్కొనేందుకు పోరాడాం. ఇప్పుడు అదే దురహంకారాన్ని బీజేపీ చూపిస్తోంది. అందుకే నేటి పోరాటం’ అని చంద్రబాబు జవాబిచ్చారు.

‘సన్ (సూర్యుడు) రైజ్ స్టేట్ గా ఏపీని మారుస్తానంటూ మీ సన్ (కుమారుడు)ను రైజ్ చేయించాలని ప్రయత్నిస్తున్నారు’ అని మోడీ విమర్శించగా.. ‘మీకు కొడుకుల్లేరు. పెళ్లాన్ని వదిలేశారు. కుటుంబం అక్కర్లేదు. ఆత్మీయతలు, అనుబంధాలు తెలియవు’ అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పాలంటే వెనకడుగు ఎందుకు. గతంలోనూ ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేదు’ అని మోడీ వ్యాఖ్యానించగా.. ‘రాజధాని అమరావతి నిర్మాణానికి మట్టి, నీళ్లు ఇచ్చారు. ఏమిచ్చారని మీకు లెక్కలు చెప్పాలి?’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

‘టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని, పార్టీని సొంతం చేసుకున్నారు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు సీనియర్’ అని మోడీ ఎద్దేవా చేయగా.. ‘వెన్నుపోటులో సీనియర్ మీరే. అద్వానీకే వెన్నుపోటు పొడిచారు. గోద్రా అల్లర్ల సమయంలో మిమ్మల్ని సీఎం పదవి నుంచి తొలగించాలని అందరూ అంటుంటే, అద్వానీయే అడ్డుకున్న విషయాన్ని మరిచారు. అటువంటి వ్యక్తికి కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు’ అని చంద్రబాబు ఆరోపించారు.

‘పార్టీలు మార్చడంలో చంద్రబాబు దిట్ట. ఓడిపోవడంలోనూ ఆయన ప్రముఖుడే. తనకన్నా సీనియర్ అని చెప్పుకుంటారు. అంతకుమించి చెప్పడానికి ఇంకేమీ లేదు’ అని మోడీ ఎద్దేవా చేయగా.. ‘నేనెన్నడూ పార్టీలు మారలేదు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోనే కొనసాగుతున్నా. ఎన్నడూ అవకాశవాద రాజకీయాలు చేయలేదు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇలా మోడీ, చంద్రబాబు రాజకీయ విమర్శలు చేసుకోవడంతోపాటు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.