మాజీ మంత్రి యనమల సోదరుడిపై కేసు

10:57 am, Sun, 18 August 19

తుని: అన్న క్యాంటీన్‌పై దాడి వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు సహా మరో ముగ్గురు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్న క్యాంటీన్ల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా యమనల కృష్ణుడు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా తునిలో టీడీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

ధర్నా అనంతరం కొందరు దుండగులు అన్న క్యాంటీన్‌పై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో క్యాంటీన్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై తుని మునిసిపల్ కమిషనర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు యనమల కృష్ణుడు సహా మరో ముగ్గురు నాయకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.