పవన్ కల్యాణ్‌లా మాకు నటించడం రాదు బాబూ: బొత్స ఎద్దేవా

4 days ago

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌లపై ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జగన్ వంద రోజుల పాలనపై వారు చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. సీఎంగా వైఎస్ జగన్ ఆయన తండ్రి వైఎస్సార్ పాలనను గుర్తు చేశారని బొత్స కొనియాడారు. జగన్ పాలను చూసి పలు పార్టీల నేతలకు నిద్రపట్టడం లేదన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా బొత్స ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికైనా పవన్ సినిమాల నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

ఒక పాత్రలో నటించడం తర్వాత దాని నుంచి బయటకొచ్చేయడం పవన్‌ కల్యాణ్‌కే చేతనవుతుందని ఎద్దేవా చేశారు. తాను బాధ్యత గల మంత్రిగా వాస్తవాలే చెబుతానని తెలిపారు.

రాజధానికి 5 వేల ఎకరాలు చాలని గతంలో పవన్‌ చెప్పలేదా అని బొత్స సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్‌లపైనా బొత్స తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేయని చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు.

హైదరాబాద్‌ నుంచి అర్ధరాత్రి వేళ పారిపోయి వచ్చి రాష్ట్రానికి అడ్రస్‌ లేకుండా చేశారని విమర్శించారు. ప్రతీ దాన్నీ వివాదం చేయదలచుకోలేదని, తాను వాస్తవాలే చెబుతున్నానని పేర్కొన్నారు.

ఇచ్చిన ప్రతీ హామీని జగన్‌ నెరవేరుస్తుండడంతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. జగన్‌ది తుగ్లక్‌ పాలన అంటూ లోకేశ్ ట్విట్టర్‌లో కామెంట్‌ చేయడంపై మండిపడ్డారు. చంద్రబాబుదే తుగ్గక్‌ పాలన అని బొత్స తిప్పికొట్టారు.