ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ‘కరోనా’ ఉద్ధృతి.. 24 గంటల్లో 11,434 పాజిటివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ( సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు ) మొత్తం 11,434 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గత రెండు వారాల్లో 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవడం ఇది ఐదోసారి. అంతేకాదు, 10 వేలకు సమీపంగా కేసులు నమోదైన రోజులు మరో రెండు ఉన్నాయి.

ఒక్కరోజు వ్యవధిలో మళ్లీ 64 మంది కరోనా మహమ్మారికి బలైపోయారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే గత 24 గంటల వ్యవధిలో 2,028 కేసులు నమోదు అయ్యాయి.

గడిచిన 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో మూడోవంతుకుపైగా కేసులు గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోనే నమోదుకావడం గమనార్హం.

ఇక 24 గంటల వ్యవధిలో విజయనగరం జిల్లాలో 8 మంది కరోనా కాటుకు బలికాగా, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో 6 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

అలాగే చిత్తూరు జిల్లాలో 5 మంది, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 4 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

ఇంకా కృష్ణా జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. గత 24 గంటల్లో మొత్తం 74,435 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

కరోనా సెకండ్ వేవ్‌కి సంబంధించి ఇప్పటి వరకు (మంగళవారం) రాష్ట్రంలో మొత్తం 10,54,875 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు 12 ఫిబ్రవరి, 2020న నమోదు కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ 12 వరకు అంటే మొత్తం 15 నెలల వ్యవధిలో 9,28,664 కేసులు నమోదు అయ్యాయి.

అయితే ఈ నెల 13-27 వరకు.. అంటే కేవలం 15 రోజుల వ్యవధిలో 1,26,211 కేసులు నమోదు అవడం చూస్తుంటే రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో చెలరేగుతోందో అర్థం అవుతుంది.