హైదరాబాద్/కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు మద్దూరు భార్గవ్‌తో శనివారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఇరువురి బంధువుల సమక్షంలో లగ్నపత్రిక రాసుకున్నారు. ఆగస్టు 29న వివాహ వేడుక నిర్వహించాలని నిర్ణయించారరు. పెళ్లి విషయమై అఖిలప్రియ మేనమామ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టులో పెళ్లి పెట్టుకున్నామని చెప్పారు. వివాహ వేడుక ఆళ్లగడ్డలో నిర్వహించే ఆలోచనలో ఉన్నామని, కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
శనివారం జరిగిన నిశ్చితార్థ వేడుకలో ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు అఖిలప్రియ సోదరి భూమా నాగమౌనిక, సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే, సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరుడు భార్గవ్‌కు పాఠశాలలతో పాటు పలు వ్యాపారాలు ఉన్నాయి.
అఖిలప్రియకు ఇదివరకు వైయస్ రాజశేఖర రెడ్డి బావమరిది, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడి నరేన్ రామాంజనేయ రెడ్డితో వివాహం జరిగింది. కానీ ఏడాది తర్వాత విభేదాల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. భార్గవ రెడ్డికి కూడా గతంలో వివాహం జరిగినా వ్యక్తిగత కారణాలతో ఆయనా భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. భార్గవ్, అఖిల ప్రియ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భార్గవ్ మాజీ డీజీపీ సాంబశివ రావు అల్లుడే కాకుండా, మంత్రి నారాయణ పెద్ద అళ్లుడు పునీత్ పిన్ని కొడుకు అని కూడా చెబుతున్నారు.
ఇక భూమా అఖిలప్రియ 2014లో తన తల్లి శోభా నాగిరెడ్డి మృతి అనంతరం రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆళ్లగడ్డ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత ఆమె మంత్రి పదవి చేపట్టారు.