ఏపీని భయపెడుతున్న ‘ఫణి’.. 30న కోస్తావైపు రాక.. ప్రభుత్వం అప్రమత్తం

- Advertisement -

విశాఖపట్టణం: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను వేగంగా కదులుతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఆ తుఫాను శనివారం ఉదయం మరింత బలపడింది. చెన్నైకి ఆగ్నేయంగా 1,050 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా దాదాపు 1100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 29వ తేదీ నాటికి ఇది అతి తీవ్ర తుఫానుగా మారబోతోందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. మూడు రోజులపాటు శ్రీలంక తీరం వెంట వాయవ్య దిశగా వెళ్లనున్న తుపాను 30న సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్రంపై వేడి 31డిగ్రీల వరకు ఉండడంతో నీరు ఆవిరై పైకి వెళ్తోంది. తుఫాను బలపడేందుకు ఇది మరింత కారణం అవుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 30న సాయంత్రానికి ఫణి తుపాను దిశ మార్చుకుని ఈశాన్యంగా వెళ్తుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఏప్రిల్‌, మేలో బంగాళాఖాతంలో వచ్చే తుపాన్లు దిశ మార్చుకుని బంగ్లాదేశ్‌, మయన్మార్‌ వైపు వెళ్తుంటాయి. ఇది కూడా అటువైపే వెళ్తుందని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ వద్ద తుపాను తీరం దాటే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఆదివారం తెల్లవారుజామున ఫణి తుఫాను ఆగ్నేయ బంగాళాఖాతంలో భూమధ్యరేఖ మీదుగా హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ప్రయాణిస్తోంది. గంటలకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోన్న ఈ తుపాను మచిలీపట్నానికి 1300 కిలోమీటర్లు, శ్రీలంకలోని ట్రింకోమలీకి 775 కిలోమీటర్లు, చెన్నైకి 1110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

ఫణి తుఫాను కారణంగా ఈనెల 30, మే 1న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఒకవేళ అది దిశ మార్చుకుని తీరానికి దూరంగా వెళ్తే మాత్రం చిన్నపాటి వర్షాలే కురుస్తాయని పేర్కొన్నారు. అయితే, రేపటి (సోమవారం) నుంచి ఒకటో తేదీ వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వివరించారు. కాబట్టి ఈ రోజుల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడమే మంచిదని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని సూచించారు.

కృష్ణపట్నం పోర్టులో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం పోర్టులో శనివారం రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. తుఫాను దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, నేవీలను సహాయక చర్యల కోసం సిద్ధం చేసింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం అయ్యారు. కాగా, తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఏ మేరకు ఉంటుందనేది నేటి సాయంత్రానికి కల్లా తేలిపోనుందని అధికారులు తెలిపారు.  

- Advertisement -