ఇండోనేషియాలో భారీ భూకంపం.. 8 నగరాలకు సునామీ హెచ్చరిక!

heavy-earthquake-in-indonesia-tsunami-warning-issued
- Advertisement -

జకార్తా: ఇండోనేషియాలో ఆదివారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఉత్తర సులావేసి, ఉత్తర మాలుకు మధ్యన మనాడోకు ఆగ్నేయంగా185 కిలోమీటర్ల దూరాన, మాలుకు సముద్రంలో.. 24 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు ఇండోనేషియా మెట్రోలాజికల్, జియోఫిజికల్ మరియు క్లైమెటోలాజికల్ ఏజెన్సీ బీఎంకేజీ అధికారులు గుర్తించారు.

చదవండి: కాలిఫోర్నియాలో భూకంపం.. భయంతో పరుగులుతీసిన జనం

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైనట్లు బీఎంకేజీ అధికారులు తెలుపగా.. దాని తీవ్రత 6.9గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలియజేశారు. మరోవైపు భారీ భూకంపం నేపథ్యంలో దాదాపు 8 నగరాలకు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అలాగే మాలుకు సముద్ర తీరంలోని సమీపం ప్రాంతాలకు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ సునామీ హెచ్చరికను జారీ చేసింది.

తీవ్ర భయాందోళనలకు గురైన టెర్నాట్ నగరవాసులు…

ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారం అందలేదు కానీ ఉత్తర మాలుకు ప్రావిన్స్‌లోని టెర్నాట్ నగర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై.. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. సునామీ హెచ్చరిక నేపథ్యంలో వారంతా ఎత్తైన ప్రదేశాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

టెర్నాట్ నగర వాసి అయిన బుడి నుర్గినాటో మాట్లాడుతూ.. ‘‘ఇక నిద్రకు ఉపక్రమిద్దామని నేను అనుకుంటున్న సమయంలో కిటికీ రెక్కలు కొట్టుకోవడం గమనించాను.. భూకంపం వచ్చిందని నాకు అర్థమైంది.. భూమి చాలా ఎక్కువగా కంపించింది. నేను ఇంట్లోంచి బయటికి పరిగెత్తాను. అప్పటికే మా ఇరుగుపొరుగు వారు కూడా వారి ఇళ్లల్లోంచి బయటికి పరుగులుదీయటం చూశా..’’ అని చెప్పారు.

2004 నాటి సునామీలో…

ఇక 2004లో ఇక్కడి సుమత్రా దీవి తీర ప్రాంతంలో సంభవించిన అత్యంత భారీ భూకంపం, సునామీల గురించి ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదు. అప్పుడు వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.1గా నమోదైంది. అప్పటి సునామీ ధాటికి ఒక్క ఇండోనేషియాలోనే లక్షా అరవై ఎనిమిది వేల మంది మరణించగా.. సమీప తీర ప్రాంతాల్లో మొత్తం రెండు లక్షల ఇరవై వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు.

గత ఏడాది కూడా సులావేసి ద్వీపంలోని పాలు ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 7.5గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా సునామీ సంభవించడంతో 2, 200 మందికిపైగా మరణించగా, దాదాపు వెయ్యి మంది గల్లంతయ్యారు.

- Advertisement -