బెంగళూరు: తుమకూరులోని సుప్రసిద్ధ సిద్దగంగ మఠాధిపతి శివకుమారస్వామి(111) సోమవారం ఉదయం 11.44 గంటల ప్రాంతంలో శివైక్యం చెందారు. గత 15రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నట్లు మఠం నిర్వాహకులు ప్రకటించారు.

ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ తలెత్తడంతో గత కొన్నివారాలుగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన శివైక్యం చెందారన్న సమాచారం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున మఠానికి తరలివస్తున్నారు. దీంతో అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, నేతలు ఎంబీ పాటిల్‌, కేజే జార్జ్‌, సదానంద గౌడ తదితర రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పించారు. కర్ణాటకలో మూడ్రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జి.పరవేశ్వర చెప్పారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు కూడా ప్రకటించారు.

నడిచే దేవుడిగా ప్రసిద్ధి: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

కాగా, శివకుమారస్వామిని ‘నడిచే దేవుడి’గా ఆయన ఆరాధకులు పిలుచుకుంటారు.
12వ శతాబ్దంలోని సంఘసంస్కర్త బసవ రూపంలో జన్మించిన అవతారమూర్తిగా స్వామిజీని కీర్తిస్తుంటారు. లింగాయత్‌లకు ఆరాధకుడైన ఆయన సిద్దగంగ విద్యాపీఠానికి అధిపతిగానూ ఉన్నారు.

ఈ విద్యాపీఠం కింద 125 అనుబంధ విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలలు కొనసాగిస్తున్నారు. ఇందులో చదువుకొంటున్న పేద విద్యార్థులకు ఉచితవిద్యతోపాటు, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లాలోని వీరపుర గ్రామంలో 1907 ఏప్రిల్‌ 1న శివకుమారస్వామి జన్మించారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని మానవతావాదిగా పేరుతెచ్చుకున్నారు. 2015లో ఆయన పద్మభూషణ్‌ అందుకున్నారు.

కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ.. స్వామిజీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనను జీవించి ఉండగా కలవడం, ఆశీర్వాదం తీసుకోవడం తన అదృష్టమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. స్వామిజీ పేద, బడుగుబలహీనర వర్గాల ప్రజల కోసమే తన జీవితాన్ని ధార పోశారని చెప్పారు. ఆయన చేసిన సమాజసేవను మరువలేమని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు.

 


English Title:

shivakumara swamiji 111 year old siddaganga seer passes away cm announces holiday 3 day mourning