ఇక సినిమాలు చేయను.. అంత ఓపిక కూడా లేదు: యండమూరి వీరేంద్రనాథ్

- Advertisement -

హైదరాబాద్: కమర్షియల్ నవలా రచయితగా యండమూరి వీరేంద్రనాథ్‌ స్టయిలే వేరు. సినీ రంగంలోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయన రాసిన ఎన్నో నవలలు.. సినిమాలుగా వచ్చి బాక్సాఫీసు వద్ద ఘన విజయాలు సాధించాయి.

అప్పుడప్పుడు యండమూరి కూడా మెగాఫోన్ చేతపడుతుంటారు. అయితే అది ఆయనకు ఆటవిడుపు మాత్రమే. తాజాగా ఆయన ‘దుప్పట్లో మిన్నాగు’ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలపై తన మనోభావాలను ఇలా వ్యక్తపరిచారు.

ఇక్కడ సక్సెస్‌‌కే విలువ…

తాను వరుసగా ఓ మూడు సినిమాలకు స్ర్కీన్ ప్లే అందించానని, అయితే ఆ మూడు సినిమాలు కూడా ఆడలేదని నవ్వేశారు యండమూరి. సినిమా సక్సెస్ అయితేనే దర్శక నిర్మాతలు దగ్గరికి వస్తారని లేకుంటే రారని చెప్పారు. మనలో ఎంత సత్తా ఉన్నా సరే.. దానిని ఎవరూ చూడరు.. పట్టించుకోరు అన్నారు.

ఇక డైరెక్షన్ ఆలోచన లేదు…

ఆ మాటకొస్తే.. సినిమా అవకాశాలు రాకపోయినా తాను హ్యాపీగానే ఉన్ననని, అవకాశాలు రావడం లేదని తాను ఈ మాటలు చెప్పడం లేదని యండమూరి అన్నారు. ఈ ‘దుప్పట్లో మిన్నాగు’ తరువాత మరో సినిమాకు డైరెక్షన్ చేసే ఆలోచన కూడా లేదని చెప్పారు.

తన వయసు వాళ్లంతా ఆల్రెడీ రిటైర్ అయ్యారని, ఈ వయసులో ఎండలో పడి కట్‌‌లు, ఓకేలు చెప్పేంత ఓపిక తనకు లేదని మనసులో మాట చెప్పేశారాయన.

శ్రీదేవితో పెద్దగా పరిచయం లేదు…

దివంగత నటి శ్రీదేవి గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు యండమూరి. శ్రీదేవి నటించిన ‘ఆఖరిపోరాటం’, ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’, ‘ఒక రాధ-ఇద్దరు కృష్ణులు’ సినిమాలకు తాను పనిచేశానని తెలిపారు. ఏదో ఒకటి రెండుసార్లు మాట్లాడటమే తప్ప.. శ్రీదేవితో తనకు పెద్దగా పరిచయం లేదని అన్నారాయన.

చిరంజీవి హీరోగా శ్రీదేవి సినిమా…

అయితే ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ సినిమా కంటే ముందు.. శ్రీదేవి మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా తీయాలనుకున్నారని, ఆ సినిమాలో ఆవిడే హీరోయిన్ అని, దర్శకుడు కోదండరామిరెడ్డి అని తెలిపారు.

సంగీత దర్శకుడిగా బప్పీలహరిని ఎంచుకున్నారని, శ్రీదేవికి చెందిన గెస్ట్ హౌస్‌లో ఉంటూ ఆ సినిమాకి తాను కొంత వర్క్ చేశానని యండమూరి వివరించారు.

ఆ సినిమాకి సంబంధించి ఒక పాట చిత్రీకరణ కూడా జరిగిందని, ఆ తరువాత కథ ఫైనలైజ్ అవకపోవడంతో ఆ సినిమా అర్థాంతరంగా ఆగిపోయిందని, ఆ తరువాతే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా విడుదలైందని చెప్పారు.

నాకు బాగా నచ్చిన నా నవలలు…

తాను రాసిన, ఆ తరువాత సినిమాలుగా వచ్చిన నవలల్లో ‘రక్తసిందూరం’, ‘ముత్యమంత ముద్దు’ తనకు బాగా ఇష్టమైనవని వీరేంద్రనాథ్ తెలిపారు. ఇక తాను రాసిన మొత్తం నవలల్లో తనకు బాగా నచ్చినవి ‘ఆనందో బ్రహ్మ’, ‘అంతర్ముఖం’ అని చెప్పారు.

‘తులసిదళం’ను వర్మ కాపీ కొట్టాడు…

తాను థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి 15 ఏళ్లు అయి ఉంటుందని, ఈ మధ్య కాలంలో తన మనవడు పట్టుబట్టడంతో ఓ ఇంగ్లీష్ సినిమా చూశానని చెప్పారు యండమూరి.

చాలాకాలం క్రితం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పూస్క్’ అనే సినిమా ప్రివ్యూకి పిలిస్తే వెళ్లానని, ఆయన తన ‘తులసిదళం’ నవలని కాపీ కొట్టి ఆ సినిమా తీశాడని, తాను ఏమైనా అనుకుంటానేమోనని తననూ పిలిచాడని చెప్పారు.

- Advertisement -