భగవద్గీత, కర్మయోగంతో శాంతి, ధైర్యం పొందవచ్చు: అమెరికన్ ఎంపీ

- Advertisement -

కొవిడ్-19, జార్జ్ ఫ్లాయిడ్ హత్య వంటి అంశాలతో అమెరికా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.

ఇదే సమయంలో ‘క్లాస్ ఆఫ్ 2020 ఫర్ హిందూ స్టూడెంట్స్’ పేరిట ఏర్పాటు చేసిన వర్చువల్ మీటింగ్‌లో హిందూ మహిళ, అమెరికన్ ఎంపీ తులసి గబార్డ్ ప్రసంగించారు.

అమెరికాలో ప్రస్తుతం ఏర్పడ్డ గందరగోళ పరిస్థితుల్లో భగవద్గీత, కర్మయోగను సాధన చేస్తే శాంతి, స్పష్టత, ధైర్యాన్ని పొందవచ్చని తులసీ గబార్డ్ తెలిపారు.

ఈ సమావేశంలో అమెరికాలోని అనేక యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని.. ఇలాంటి సమయంలో కృష్ణుడు బోధించిన భగవద్గీతను సాధన చేస్తే శాంతి, ధైర్యం సంపాదించవచ్చని ఆమె అన్నారు.

‘జీవితంలో నా లక్ష్యం ఏంటి? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 

కర్మ యోగను అభ్యసిస్తూ దేవుడు, దేవుడి పిల్లలకు సేవ చేయడమే మీ లక్ష్యమని మీరు గుర్తించగలిగితే విజయవంతమైన జీవితాన్ని గడుపుతార’ని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులతో ఆమె అన్నారు.

హిందూ స్టూడెంట్స్ కౌన్సిల్‌ను 1990లో స్థాపించారు. ఉత్తర అమెరికాలోని అతిపెద్ద హిందూ యూత్ ఆర్గనైజేషన్‌గా ఈ సంస్థ ప్రఖ్యాతగాంచింది.

కాగా.. తులసి గబార్డ్ 1981లో అమెరికాలోని సమోవాలో జన్మించారు. అతి చిన్న వయసులోనే అమెరికా పార్లమెంటుకు ఎన్నికైన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

అంతేకాకుండా అమెరికా పార్లమెంటుకు వెళ్లిన తొలి హిందువుగా కూడా ఆమె రికార్డు సృష్టించారు.

హిందూ మతాన్ని విశ్వసించే తులసీ గబార్డ్‌‌కు అమెరికాలోని భారతీయుల నుంచి భారీ మద్దతు ఉంది.

- Advertisement -