అక్కరా:లాక్డౌన్ కారణంగా దేశంలో వేలమంది వలస కార్మికులు వేరే వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయి నానా అవస్థలు పడిన విషయం తెలిసిందే.
అయితే ఓ విదేశీ ఫుట్‌బాలర్ కూడా మన దేశంలో ఇరుక్కుపోయాడు. ఒకరోజు, రెండు రోజులు కాదు.. దాదాపు మూడు నెలలపాటు ఇక్కడే ఇరుక్కుపోయాడు.
ఎక్కడో రోడ్డుపై కాదులెండి. ముంబై ఎయిర్‌పోర్టులో.. వివరాల్లోకి వెళితే.. ఘనాకు చెందిన ర్యాండీ జువాన్ ముల్లర్ అనే 23 ఏళ్ల ఫుట్ బాలర్ లాక్‌డౌన్‌కు ముందు భారత్‌కు వచ్చాడు.
jకానీ, తిరిగి వెళ్లే సమయానికి కరోనా కారణంగా భారత్‌లో లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో అతడు తన సొంత దేశానికి వెళ్లేందుకు వీలులేకుండా పోయింది.
దీంతో అతడు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవలసి వచ్చింది. 74 రోజులుగా అతడు ఆ ఎయిర్‌పోర్టులోనే నివసిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో అతడిని ఇటీవలే ఎయిర్‌పోర్టు నుంచి ఓ హోటల్‌కు తరలించినట్లు యువసేన నేత రాహుల్ కనాల్ తెలిపారు.
ముల్లర్ విమానాశ్రయంలో ఉన్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన గార్డెన్లలో ఎక్కువ సమయం గడిపేవాడని చెప్పుకొచ్చారు.
ఆహారం కోసం దగ్గరలోని స్టాళ్లపై ఆధారపడేవాడని, మిగతా సమయంలో విమానాశ్రయం సిబ్బందితో మాట్లాడుతూ సమయాన్ని వెళ్లదీసేవాడని వివరించారు.
అయితే చిట్టచివరకు అతడిని ఓ హోటల్ మార్చామని, ఇప్పడు అక్కడే ఉంటున్నాడని రాహుల్ చెప్పారు.
అనంతరం ముల్లర్ మాట్లాడుతూ, తనకు విమానాశ్రయం సిబ్బంది ఎంతో సహకరించారని, ఇన్నిరోజులుగా తనను భరించినందుకు వారికి కృతజ్ఞతలని చెప్పాడు.