వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్ ఇచ్చారు అమెరికన్లు. తాజాగా అమెరికా మధ్యంతర ఎన్నికల్లో.. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఎగువసభ అయిన సెనేట్‌లో తన పట్టు నిలుపుకొన్నప్పటికీ.. దిగువసభగా భావించే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్.. అంటే ప్రతినిధుల సభలో మాత్రం డెమొక్రాట్లు దిమ్మతిరిగే షాకిచ్చారు.
ప్రతినిధుల సభలో అత్యధిక స్థానాలు సొంతం చేసుకుని.. తమ సత్తా ఏమిటో అధ్యక్షులవారికి చాటిచెప్పారు డెమొక్రాట్లు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్యంతర ఎన్నికలు ట్రంప్ తెంపరితనానికి ఒక రెఫరెండమ్ (ప్రజాభిప్రాయం) వంటిదని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
2016 అధ్యక్ష ఎన్నికల్లో ఇరు సభల్లోనూ రిపబ్లికన్లే మెజారిటీ సాధించడంతో… ఇప్పటిదాకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు ఎదురు లేకుండా పోయింది. దీంతో ఆయన పాలన నల్లేరుపై నడకలా సాగింది. అయితే తాజా మధ్యంతర ఎన్నికల ఫలితాలు మాత్రం మున్ముందు ట్రంప్ ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితులను సృష్టించనున్నాయి.
ప్రతినిధుల సభలో…
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో దిగువ సభగా పేర్కొనే ప్రజా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలు ఉండగా వాటన్నింటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. ఈ సభలో మెజారిటీ సాధించేందుకు డెమొక్రాట్లకు గతంలో 23 స్థానాలు తక్కువగా ఉండేవి. అయితే తాజా ఎన్నికల్లో 219 స్థానాల్లో గెలుపొందిన డెమొక్రాట్లు తమ ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచుకోగలిగారు.
సెనేట్‌లో…
అమెరికా కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్‌లో మొత్తం స్థానాలు 100. వీటిలో ట్రంప్ పార్టీ రిపబ్లికన్లకు 51 స్థానాలు ఉండగా, డెమొక్రాట్లకు 49 స్థానాలు మాత్రమే ఉన్నాయి. సెనేట్‌లో 29 డెమొక్రాట్ స్థానాలకు, 6 రిపబ్లికన్ స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సభలో రిపబ్లికన్లకు ఉన్న మెజారిటీ స్వల్పమే అయినా.. ప్రస్తుత మధ్యంతర ఎన్నికల్లో దీనిని మరింత పెంచుకునేందుకు ట్రంప్ వర్గం ప్రయత్నిస్తోంది. ముగ్గురు సిట్టింగ్ డెమొక్రాట్ అభ్యర్థలు ఇప్పటికే పరాజయం పాలుకావడం వీరికి కలిసి వచ్చిన అంశంగా చెప్పవచ్చు.
ప్రస్తుతం..
ప్రస్తుతం మధ్యంతర ఎన్నికల్లో భాగంగా సెనేట్‌లోని 100 స్థానాల్లో 35 స్థానాలకు.. 36 గవర్నర్ పదవులకు ఓటింగ్ జరిగింది. అమెరికాలో గవర్నర్ల పాత్ర, వారికి ఉండే అధికారాలు చాలా కీలకం. అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపేది కూడా వారే.
ప్రస్తుతం 50 రాష్ట్రాలకు గాను 36 రాష్ట్రాల గవర్నర్ల ఎన్నిక ప్రక్రియ జరుగుతోంది. అటు న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వరకు, ఇటు మిస్సోరీ నుంచి జార్జియా వరకు అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటీపడడం విశేషం. 219 స్థానాల్లో గెలుపొందిన డెమొక్రాట్లు కాంగ్రెస్‌లోని ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్’లో ఆధిక్యం సాధించారు. ఇక ‘సెనేట్’లో అయితే అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అతి కష్టం మీద స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకోగలిగింది.
అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం రోజంతా వైట్‌హౌస్‌లో తన మిత్రులు, సన్నిహితులతో కలిసి ఎన్నికల ఫలితాలను చూస్తూ గడిపారు. మధ్యంతర ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. ‘‘ఈ రాత్రి అద్భుతమైన విజయం లభించింది. మీ అందరికీ ధన్యవాదాలు!’’ అంటూ ట్వీట్ చేసినప్పటికీ.. మున్ముందు ట్రంప్‌కు చుక్కలు కనిపించడం ఖాయమని, ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకు ప్రత్యక్ష నరకం కనపడుతుందనేది విశ్లేషకులు మాట.
ఇక ఇప్పుడేం జరుగుతుందంటే..
గత రెండు సంవత్సరాలుగా ఇటు సెనేట్‌లోనూ, అటు ప్రతినిధుల సభలోనూ మెజారిటీ కలిగిన ట్రంప్ ప్రభుత్వం సునాయాసంగా పలు చట్టాలను రూపొందించగలిగింది. కానీ ఇప్పుడు ప్రతినిధుల సభలో ట్రంప్ పప్పులు ఉడకవు. ఇకపై ప్రవేశపెట్టబోయే చట్టాలను అడ్డుకోవడంతోపాటు.. అవసరమైతే ట్రంప్ పాదాల కింద మంటపెట్టే అవకాశం డెమొక్రాట్లకు ఉంటుంది.
పారదర్శకత లేని ఆర్థిక వ్యవహారాలతో పాటు, గత అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపైనా దర్యాప్తు కోరవచ్చు. అంతేకాదు తేడా వస్తే ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టొచ్చు. అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ తీసుకున్న పరిపాలనా పరమైన, వ్యాపార పరమైన నిర్ణయాలపై డెమొక్రాట్లు విచారణ జరపొచ్చు. పన్ను చెల్లింపులు, వ్యాపార-రాజకీయ సంబంధ విరుద్ధ ప్రయోజనాల వ్యవహారాలపైనా దృష్టిసారించొచ్చు.
మరీ ముఖ్యంగా.. ట్రంప్ చేసే చట్టాలను గట్టిగా అడ్డుకోవచ్చు. మెక్సికో దేశ సరిహద్దులో భారీ గోడ కడతానంటూ ట్రంప్ చేసిన హామీ అమలుకు అడ్డుపడొచ్చు.
గత అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన ‘ఒబామా కేర్’ వంటి ప్రతిష్టాత్మక హెల్త్ కేర్ పథకాన్ని తొలగించాలన్న ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నానికి సొంత పార్టీ ప్రతినిధుల నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో ట్రంప్ నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రెండు సభల్లో రిపబ్లికన్లకు ఆధిక్యత ఉన్న సమయంలో కూడా అనేక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న ట్రంప్ ప్రభుత్వానికి.. తాజా ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించడం ద్వారా‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్’లో డెమొక్రాట్ల పట్టుబిగించడం ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగానే భావించాలి. ఇకమీదట గతంలో మాదిరిగా ఏకపక్ష పోకడలు ప్రదర్శించడం అధ్యక్షుడు ట్రంప్‌కు సాధ్యం కాకపోవచ్చు.
డెమొక్రాట్ల ప్రాబల్యంతో ట్రంప్ ఎదుర్కోబోయే కష్టాలు ఇవే..
డెమొక్రాట్ల సహాయం లేకుండా ట్రంప్ ప్రభుత్వం చట్టాలను రూపొందించడం అసాధ్యం. అంతేకాదు, శ్వేతసౌధంతోపాటు పలు కీలకమైన వ్యవహారాలను పరిశీలించే అత్యంత శక్తివంతమైన కాంగ్రెస్ కమిటీల్లో డెమొక్రాట్లు తమ ప్రభాల్యాన్ని చూపించే అవకాశాలున్నాయి.
అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు ఆయన సహాయకులపై విచారణ జరిపించవచ్చు. సాక్ష్యాలు, పత్రాలు, ఆధారాల కోసం కార్యానిర్వాహక సంస్థలు, అధికారులు, విభాగాలను డెమొక్రాట్లు కోరవచ్చు.
రహస్య పన్ను రాబడిని చెల్లించమని అధ్యక్షుడు ట్రంప్‌ను డెమొక్రాట్లు ఒత్తిడి చేయవచ్చు. పలు కీలమైన వ్యవహారాలలో ట్రంప్‌కు అత్యంత రక్షణాత్మకంగా మారిన ‘హౌస్ ఇంటెలిజెన్సీ కమిటీ’కి చైర్మన్‌గా వ్యవహరించనున్న ఆడం షీఫ్ వ్యవహారాలను డెమొక్రాట్లు నిశితంగా పరిశీలించవచ్చు.
ప్రస్తుతం ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న డెవిన్ నూన్స్.. ట్రంప్ వ్యవహారాలు, ముఖ్యంగా ప్రచారానికి సంబంధించిన విచారణ విషయాల్లో ట్రంప్‌ను రక్షిస్తున్నారు.