బోధన్: నిజామాబాద్‌లోని సారంగాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ ఓ యువతిని నయవంచనకు గురిచేశాడు. ఆమెతో ప్రేమ నటిస్తూ.. గుడికి తీసుకెళతానంటూ బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం జరిపాడు. అంతటితో ఆగలేదు. తన స్నేహితులను కూడా పిలిచి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఉసిగొలిపాడు.
దీంతో ఆ ఆరుగురు మృగాళ్లు ఆ యువతిని బెదిరించి.. ఒకరి తరువాత ఒకరు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. పైగా ఆ ఘటనను తమ వద్దనున్న మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. అయితే అటుగా పోలీసులు రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సభ్య సమాజం తలదించుకునేలా శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ దురాగతం వివరాలు ఇలా ఉన్నాయి.
సారంగాపూర్‌కు చెందిన సురేశ్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. నిజామాబాద్ నగర శివారులోని ఓ పల్లెటూరుకు చెందిన యువతి (24)తో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ యువతిది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఏడాది కాలంగా ఆమె పని చేస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలిచింది.
సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆ యువతి తరచూ సురేశ్ ఆటోలోనే ఫ్యాక్టరీకి వెళ్లేది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అయితే సురేశ్‌కి అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆ విషయాన్ని ఆ యువతికి చెప్పకుండా దాచిపెట్టి ఆమెతో ప్రేమ నటించాడు. ఆమె అతడ్ని పూర్తిగా విశ్వసించింది. దీంతో సురేశ్ ఆమెను తరచూ సినిమాలు, షికార్లకు తీసుకెళ్లేవాడు.
శుక్రవారం మధ్యాహ్నం సారంగాపూర్ హనుమాన్ ఆలయానికి వెళ్దామంటూ సురేశ్ తన ప్రియురాలికి మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు. అయితే ఆలయానికి తీసుకెళ్లకుండా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. జిల్లా జైలు వెనుక భాగంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆటోను ఆపి.. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం.. తన స్నేహితులు మరో ఆరుగురిని కూడా అక్కడికి రప్పించాడు. అనంతరం వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దారుణాన్ని మరో ఇద్దరు యువకులు తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు.
పోలీసుల రాకతో..
ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిపిన వారిలో అత్యధికులు ఆటో డ్రైవర్లే కావడం గమనార్హం. ఆ గ్యాంగ్ రేప్‌ను వీడియో తీసిన ఇద్దరు యువకులు.. ఆ తరువాత జైలు పరిసర ప్రాంతంలో తమ ఆటో నిలిపి ఉంచి ఆ వీడియోను చూడసాగారు. అదే సమయంలో నిజామాబాద్ 6వ పట్టణ పోలీసులు ఓ కేసు దర్యాప్తు నిమిత్తమై అటుగా వచ్చారు.
అటవీ ప్రాంతం మధ్యలో ఆటో ఉండడం గమనించిన వారు ఆ ఇద్దరు యువకులను ప్రశ్నించారు. ఆ సమయంలో అటుగా పోలీసులు వస్తారని ఊహించని ఆ యువకులు తడబడుతూ సమాధానాలు ఇవ్వడంతో పోలీసులకు అనుమానం కలిగింది. తమను చూసి భయపడడం, పైగా పొంతన లేని సమాధానాలు ఇస్తుండడంతో వారు తమదైన శైలిలో ప్రశ్నించడం మొదలుపెట్టారు.
దీంతో ఆ యువకులిద్దరూ జరిగినదంతా చెప్పేశారు. ఆ యువతిపై తాము ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదని, కేవలం ఆ ఘటనను వీడియో మాత్రమే తీశామంటూ బొంకారు. దీంతో వారిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు వారి మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం బాధితురాలిని గుర్తించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా తనపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె పోలీసుల వద్ద ఘొల్లుమంది. దీంతో ఆ మేరకు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ఆ యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన యువకులందరూ సారంగాపూర్ గ్రామానికి చెందిన వారేనని, వారిలో చాలా మంది ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులందరూ పరారీలో ఉన్నారని, వారి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉన్నాయని, వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని వివరించారు.