ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేక.. టిక్‌టాక్ స్టార్‌ను దారుణంగా చంపేశాడు!

- Advertisement -

హర్యానా: నేర సంబంధ టీవీ కార్యక్రమాల నుండి ప్రేరణ పొందిన ఓ వ్యక్తి హర్యానా టిక్‌టాక్ స్టార్‌ను దారుణంగా హత్య చేశాడు.

ఆమె చనిపోయిన రెండురోజుల తర్వాత కూడా ఆమె ఫోన్ నుంచి మెసేజ్‌లు, వీడియోలు పోస్ట్‌ కావడంతో ఆమె ఇంకా బతికేఉన్నదని అభిమానులు భావించారు. చివరకు ఆమె బ్యూటీపార్లర్‌లోనే ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

హర్యానా సోనిపట్‌ నగరంలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న శివానీ ఖుబియాన్‌.. టిక్‌టాక్‌లో చేరిన కొద్దికాలానికే స్టార్‌ స్థాయికి ఎదిగింది. ఈమెకు టిక్‌టాక్‌లో లక్ష మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఈ నెల 26 నుంచి ఆమె కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆదివారం సాయంత్రం ఆమెకు చెందిన బ్యూటీ పార్లర్‌ నుంచి దుర్గంధం వస్తుండటాన్ని గుర్తించిన శివానీ సన్నిహితులు ఆ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. 

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

“ఇంటి పొరుగునే ఉండే ఆరిఫ్‌ అనే వ్యక్తి జూన్ 26 న శివానిని కలవడానికి వచ్చాడు. ఆరోజు రాత్రి శివానీ ఇంటికి తిరిగి రాలేదు. తల్లి ఆరోగ్యం బాగోలేనందున వెంటనే రావాల్సిందిగా నేను ఆమె ఫోన్‌కు మెసేజ్‌ పెట్టాను. అయితే, తాను బాగానే ఉన్నానని, హరిద్వార్‌కు వెళ్లినందున మంగళవారం నాటికి ఇంటికి తిరిగి వస్తానని ఆమె ఫోన్ నుంచి నాకు సందేశం వచ్చింది.”అని శివానీ సోదరి శ్వేత పోలీసులకు చెప్పారు. 

శివానీ అభివృద్ధిని చూసిన పొరుగున ఉండే ఆరిఫ్‌ గిట్టేవాడుకాదు. ఆమెను గత మూడేళ్లుగా కొడుతున్నాడు. ఆయన బాధ భరించలేక ఇంటిని వేరే ప్రాంతానికి మార్చాం అయినా అడ్రస్‌ తెలుసుకొని  ఆమెను అనుసరిస్తున్నాడు.

ఇంతలో ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు  అని  శివానీ తండ్రి  వినోద్‌ ఖుబియాన్‌ పోలీసులకు వెల్లడించాడు. పరారీలో ఉన్న ఆరిఫ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఆమె మృతదేహాన్ని గుర్తించడానికి 7 గంటల ముందు ఆమె ఫోన్‌ ఖాతా నుంచి టిక్‌టాక్‌లో వీడియో పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

 
- Advertisement -