టెక్కీ వికృత చేష్టలు.. ఉద్యోగం పేరుతో 600 మంది అమ్మాయిల నగ్నఫొటోలు సేకరించి…

7:57 am, Sat, 24 August 19

హైదరాబాద్: అతడో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఉద్యోగాల పేరుతో 16 రాష్ట్రాల్లోని 2 వేల మంది అమ్మాయి జీవితాలతో ఆడుకున్నాడు. 300 మంది అమ్మాయిలు అతడి బారినపడి విలవిల్లాడారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో అతడి అకృత్యాలు వెలుగులోకి రావడమే కాదు, పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని తిరువొత్తియూర్‌కు చెందిన క్లెమెంట్ రాజ్ అలియాస్ ప్రదీప్ (33) టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. 2011లో వివాహమైన ప్రదీప్‌కు ఏడేళ్ల కుమారుడున్నాడు. ప్రదీప్ ఉద్యోగం రాత్రివేళ కావడంతో ఉదయమంతా ఇంట్లోనే ఉంటాడు. భార్య ఉదయం ఉద్యోగానికి వెళ్లడంతో ఒక్కడే ఉండేవాడు.

చదవండి: తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయవాదికి సంకెళ్లు.. ఉద్యోగం పేరుతో రూ.78 లక్షలు వసూలు

ఈ క్రమంలో అతడి ఆలోచనలు అడ్డదారి పట్టేలా చేశాయి. అమ్మాయిలను నగ్నంగా చూస్తూ లైంగిక వాంఛ తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం క్వికర్ డాట్ కామ్ అనే వెబ్‌సెట్‌ను ఎంచుకున్నాడు. అందులో రిసెప్షనిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని అందులోని నంబర్లను సేకరించేవాడు.

హోటల్‌ ఉద్యోగిగా పరిచయం చేసుకుని…

అనంతరం వారికి ఫోన్ చేసి తనను తాను రాడిసన్‌ హోటల్‌ ఉద్యోగిగా పరిచయం చేసుకునేవాడు. ఉద్యోగుల ఎంపిక బాధ్యత తనదేనని నమ్మించేవాడు. ఆ తర్వాత తమ ప్రతినిధి ఒకరు వాట్సాప్‌లో ఇంటర్వ్యూ చేస్తారని వారిని నమ్మబలికేవాడు.

ఆ తర్వాత వేరే నంబరును నుంచి అమ్మాయిలా కాల్ చేసేవాడు. ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగం కాబట్టి శరీరాకృతి చూడాల్సిన అవసరం ఉందని, ఎంపిక ప్రక్రియలో అదో భాగమని వారికి చెప్పేవాడు.

వారు తటపటాయిస్తే.. తాను కూడా మహిళనే కదా అంటూ వారిని నమ్మించేవాడు. అలా వారి నుంచి నగ్న చిత్రాలను సేకరించేవాడు. మొత్తం 16 రాష్ట్రాలకు చెందిన 2 వేల మంది మహిళల నగ్న ఫొటోలను వాట్సాప్‌లో సేకరించాడు. ఒకసారి ఆ ఫొటోలు తన చేతికి చిక్కాక అసలు రూపాన్ని బయటపెట్టేవాడు.

300 మంది అమ్మాయిలతో…

వాటిని చూపించి బెదిరిస్తూ వీడియో కాలింగ్ ద్వారా తన లైంగిక వాంఛ తీర్చాలని ఒత్తిడి తెచ్చేవాడు. అలా మూడువందల మంది అమ్మాయిలతో వీడియో కాలింగ్ చేశాడు. అతడి వలలో చిక్కి విలవిల్లాడిన హైదరాబాద్ శివారులోని మియాపూర్‌కు చెందిన అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితుడు చెన్నైలో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. శుక్రవారం కూకట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. నగరానికి చెందిన మరికొంతమంది యువతులు అతడి మోసానికి బలైనట్టు పోలీసులు గుర్తించారు.

కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. బాధితులు ఎవరైనా ఉంటే మియాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, లేదంటే, 83329 81116 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

చదవండి: ఓయో టౌన్ విల్లా హోటల్‌లో వ్యభిచారం.. ఇద్దరు యువతులు అరెస్ట్