కృష్ణా: చంద్రగ్రహణం రోజునే క్షుద్రపూజలు, నరబలి యత్నం కలకలం రేపాయి. జిల్లాలోని నూజివీడు మండలం యలమందలో శుక్రవారం నరబలి ఇచ్చేందుకు ఏడుగురు వ్యక్తులు ప్రయత్నించారు. యలమంద సమీపంలోని పొలాల్లో ఐదడుగుల లోతున ఏడు గుంతలు తవ్వారు. రాంప్రసాద్ అనే వ్యక్తితోపాటు ఏడుగురు దుండగులు చిన్నం ప్రవీణ్ అనే యువకుడిని అక్కడి తీసుకెళ్లారు. ఆ భారీ గుంతలను గమనించిన ప్రవీణ్.. ఏదో జరుగుతోందని గమనించి వారి బారి నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని రాంప్రసాద్ తోపాటు ఆ ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఓ చెట్టు వద్ద పూజలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి వారిని పోలీసులు విచారిస్తున్నారు. చంద్ర గ్రహణం రోజున నరబలి ఇస్తే గుప్త నిధులు దొరుకుతాయనే ఈ ఘోరానికి సిద్ధమయ్యారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర అలజడి రేపింది.