వీడొక ‘సైకో’: ముందు ఊపిరాడకుండా చేసి.. ఆపైన హత్యాచారాలు!

6:59 pm, Wed, 1 May 19
hajipur-psycho-killer-srinivas-reddy

వాడొక సైకో. అంటే మానసిక రోగి. చూడ్డానికి మామూలుగానే కనిపిస్తాడు. కానీ ఆ ఊరిలో ఎప్పుడు ఏ అమ్మాయిపై కన్నేస్తాడో తెలియదు. వాడు కన్నేశాడంటే ఇక ఆ అమ్మాయి ఔటే! దారిన పోయే అమ్మాయిలే అతడి టార్గెట్. ఎప్పుడైనా వాళ్లు ఒంటరిగా దొరికారంటే ఇక వాడికి పండగే!

ముందు లిప్ట్ ఇస్తానంటాడు. తన బైక్‌పై ఊళ్లోకి తీసుకెళ్లి దింపేస్తానంటాడు. పాపం.. అమాయకంగా అతడి మాటలు నమ్మి బండి ఎక్కిందా?.. ఇక తరువాత ఆ అమ్మాయి కనిపించదు. ఎక్కడికెళ్లిందో, ఏమైపోయిందో ఎవరికీ అర్థం కాదు. పోలీసులూ ఫిర్యాదు నమోదు చేసుకోవడమే తప్ప ఆ అమ్మాయి ఆచూకీని మాత్రం కనిపెట్టలేరు.

వీడు మాత్రం తనకే పాపం తెలియదన్నట్లు ప్రవర్తిస్తుంటాడు. ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. అప్పుడప్పుడూ ఊళ్లోకి వస్తుంటాడు. అలా 2015లో ఓ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. అదే ఏడాది తన లైంగిక వాంఛ తీర్చమంటూ ఓ మహిళను వేధించాడు. 2016లో మరో మహిళపై దాడి చేసి, హత్య చేశాడు.

తాజాగా 2019లోనూ ఓ అమ్మాయిపై అత్యాచారం చేసి, ఆపైన హతమర్చాడు. ఇప్పుడూ దొరికిపోయేవాడు కాదు. ఓ అమ్మాయి అదృశ్యం కేసులో విచారణ జరుపుతుండగా, పోలీసు జాగిలాలు వాడి పొలం దగ్గరికి వచ్చి అక్కడి బావి వద్ద ఆగిపోయాయి. ఆ బావిలో ఏదో ఉన్నట్లు పోలీసులకు అనుమానం వచ్చింది.

దిగి వెతికారు. మట్టిలో పూడ్చిపెట్టబడిన బాలిక మృతదేహం లభించింది. అంతటితో వాళ్లు వదల్లేదు.. తీగ లాగితే డొంకంతా కదిలింది.. వరుసగా వాడు చంపి పూడ్చిపెట్టిన అమ్మాయిల మృతదేహాలు బయటపడ్డాయి. ఇంకేముంది హాజీపూర్ ఘోల్లుమంది!

ఈ సైకో పేరు మర్రి శ్రీనివాస రెడ్డి(28). వీడు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌కు చెందిన వాడు. లిఫ్టు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు ముగ్గురు అమ్మాయిలపై హత్యాచారాలు చేశాడు. వీడిపై ఒక వేధింపుల కేసు కూడా ఉంది.

హాజీపూర్‌కి చెందిన ఓ అమ్మాయి(14) స్కూలుకెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన ఆ అమ్మాయి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగేసరికి శ్రీనివాస రెడ్డి బండారం మొత్తం బయటపడింది.