గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థినిపై తొమ్మిది మంది సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధిత బాలిక స్థానికంగా ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో చదువుకుంటోంది. ఆమెలో మానసికంగా ఎదుగుదల లేకపోవడాన్ని గుర్తించిన సురేంద్ర అనే మాజీ సైనికోద్యోగి ఆ విద్యార్థినిపై కన్నేశాడు.
రోజూ కళాశాలకు వచ్చి వెళ్లే ఆ బాలికతో సురేంద్ర పరిచయం పెంచుకున్నాడు. అతడి మాయమాటలు ఆమె నమ్మేసింది. ఈ క్రమంలో ఆ బాలికకు మద్యం కూడా అలవాటు చేశాడు. పూర్తిగా తన మాయలో పడిందని నిర్ధారించుకున్నాక ఓ రోజు తన బర్త్ డే అని చెప్పిన సురేంద్ర.. పార్టీ ఇస్తున్నానని చెబుతూ తన ఇంటికి పిలిచాడు. అక్కడికి వెళ్లిన తరువాత ఆ బాలిక చేత బాగా మద్యం తాగించాడు.
ఆ తరువాత అతడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. మరో ఎనిమిది మందితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తరువాత ఆ బాలిక ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించారు. దీంతో జరిగిన ఘోరం బయటపడింది.
ఈ మేరకు బాధిత బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సురేంద్రతోపాటు మరికొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆ బాలికకు వైద్య పరీక్ష చేయించగా.. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.