పట్నా: ఓ వ్యక్తి చిన్న కారణానికే భార్య మీద ఆగ్రహంచి.. ఆమె మీద కోపంతో నాలుగేళ్ల కూతుర్ని కొట్టి చంపేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం పాట్నాకు 360కి.మీ దూరంలో ఉన్న పుర్నియా పరిధిలోని ఫకిర్తోలి అనే గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. శంభూలాల్ శర్మ (40) గుజరాత్‌లో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీపావళి పండగ సందర్భంగా ఇటీవలే ఫకిర్తోలి గ్రామంలోని తన ఇంటికి వచ్చాడు.
మాంసం, మద్యానికి బానిస అయిన శంభూలాల్ శర్మ తరచూ తన భార్యను వేధించేవాడని.. గతంలోనూ ఒకసారి మాంసం కూర సరిగా వండనందుకు భార్యను చావబాది, నిప్పుతో కాల్చేందుకు ప్రయత్నించాడని స్థానికులు చెబుతున్నారు.
వంటలో భార్య ఆలస్యం చేసిందంటూ…
ఈ క్రమంలో బుధవారం అతడి భార్య వంట చేయడంలో ఆలస్యం చేసిందంటూ కోపోద్రేకానికి గురి అయిన శంభూలాల్ తన వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల కూతుర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడమే కాకుండా కోపంతో అ చిన్నారిని నేలకేసి విసిరి కొట్టాడు.. దీంతో అ చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది.
ఆ తరువాత కోపం తగ్గిన అతడు తేరుకుని అ చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పాపను పరిక్షించిన వైద్యులు అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దాంతో శంబులాల్ భయంతో పాప మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పుర్నియా ఆసుపత్రికి తరలించారు.