నదిలో దూకిన ప్రేమజంట.. యువకుడి మృతి, యువతి ఆచూకీ కోసం గాలింపు

- Advertisement -

పాశర్లపూడి: పెద్దలు తమ పెళ్లికి నిరాకరించారన్న కారణంతో ఓ ప్రేమజంట శనివారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ జంటలో యువకుడి మృతదేహం లభ్యంకాగా యువతి ఆచూకీ కోసం మత్య్సకారుల సహాయంతో పోలీసులు గాలిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..  తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన యెలిశెట్టి నాగశివదుర్గ (21) ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. పెదపట్నం గ్రామానికి చెందిన ముత్యాల నాగ సుజిత(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. నగరంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ అదే గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకుంటోంది. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో ఇరువురినీ మందలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పిన నాగసుజిత పెదపట్నంలోని తన ఇంటి నుంచి సైకిల్‌పై బయటికొచ్చింది. మోటార్‌ సైకిల్‌పై వచ్చిన నాగశివదుర్గ ఆమెను ఎక్కించుకుని పాశర్లపూడికి వచ్చాడు.  అనంతరం ఇద్దరూ అక్కడి వైనతేయ వారధి పైనుంచి గోదావరి నదిలోకి దూకి అత్మహత్యకు పాల్పడ్డారు.

మోటార్‌ సైకిల్‌లో సెల్‌ఫోన్, కొంత నగదు, చాక్లెట్‌ ప్యాకెట్లు ఉన్నాయి. వారు నదిలోకి దూకడం గమనించిన స్థానికులు మోటార్‌ సైకిల్‌లో ఉన్న సెల్‌ఫోన్‌ నుంచి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నాగ సుజిత తండ్రి నర్సింహమూర్తి, తల్లి కనకదుర్గ.. అలాగే నాగశివదుర్గ తండ్రి రాము, తల్లి కుమారి, వారి కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మత్య్సకారుల సహాయంతో గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ నేపథ్యంలో యెలిశెట్టి నాగశివదుర్గ మృతదేహం లభ్యమైంది. ముత్యాల నాగ సుజిత ఆచూకీ లభించలేదు.  దీంతో ఆమె కోసం గోదావరి నదిలో గాలిస్తున్నారు.

- Advertisement -