అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన ‘లేడీ సచిన్’.. మిథాలీ రాజ్!

- Advertisement -

హైదరాబాద్: టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు అభిమానులను ఆశ్చర్యపరిచింది.

1999లో ఇండియా తరపున అరంగేట్రం చేసిన మిథాలీ తన 23 ఏళ్ల సుదీర్ఘ కెరియర్‌లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20లు ఆడింది.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన మిథాలీ.. సంవత్సరాలుగా అభిమానుల నుంచి అందుతున్న ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది.

అభిమానుల ఆశీర్వాదాలు, మద్దతుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని తెలిపింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని అత్యున్నత గౌరవంగా భావిస్తున్నట్టు చెబుతూ ఉద్వేగానికి గురైన లేడీ సచిన్.. ఇండియా బ్లూ కలర్‌ను ధరించే ప్రయాణంలో చిన్న అమ్మాయిగా బయలుదేరినట్టు చెప్పింది.

ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసినా నిలదొక్కుకున్నట్టు పేర్కొంది. 23 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతో సంతృప్తికరంగా సాగిందని తెలిపింది.

తాను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి భారత్‌ను గెలిపించాలనే తపనతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినట్టు వివరించింది.

ఈరోజు తాను అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్న రోజని పేర్కొంది. త్రివర్ణ పతాకానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని తాను ఎప్పుడూ గౌరవిస్తానని మిథాలీ పేర్కొంది.

చదవండి:  India vs South Africa: టీ20 సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ అవుట్.. కెప్టెన్‌గా రిషభ్ పంత్

చాలామంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ల చేతుల్లో జట్టు ఉందని, భారత క్రికెట్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉన్నందున తన క్రీడా జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్టు మిథాలీ రాజ్ తెలిపింది.

ముందుగా ఒక క్రీడాకారిణిగా, ఆ తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా తనకు లభించిన మద్దతుకు బీసీసీఐ, బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొంది.

తన అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాననంటూ మిథాలీ ముగించింది.

23 ఏళ్ల సుదీర్ఘ కెరియర్‌లో అత్యద్భుతమైన ఆట తీరుతో పలు రికార్డులు సృష్టించిన మిథాలీ.. వన్డేల్లో 7,805 పరుగులు చేసింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లొట్టె ఎడ్వర్డ్స్ కంటే 2 వేల పరుగులు ఎక్కువ కావడం గమనార్హం.

ఇందులో 7 సెంచరీలు, 64 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే, 12 టెస్టుల్లో 699 పరుగులు చేసింది. ఇందులో ఓ శతకం, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

89 టీ20ల్లో 37.52 సగటుతో 2,364 పరుగులు చేసింది. ఇందులో 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 97 నాటౌట్.

 

- Advertisement -