బాహుబలి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధు ప్రకాశ్ భార్య ఆత్మహత్య

12:11 pm, Wed, 7 August 19

హైదరాబాద్: తెలుగు బుల్లితెర నటుడు, బాహుబలి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధు ప్రకాశ్ భార్య భారతి (34) గతరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మణికొండ పంచవటి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధుప్రకాష్ వేధింపులే భారతి ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య గొడవలే భారతి ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

గుంటూరుకి చెందిన భారతికి 2015లో మధుప్రకాష్‌తో వివాహమైంది. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భారతి అత్తమామలతో కలిసి మణికొండలోని పంచవటి కాలనీలో నివసిస్తోంది. మధుప్రకాశ్ సీరియల్‌లో నటిస్తుండం కారణంగా ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు. ఇది నచ్చని భారతి సీరియల్స్‌ మానేయమని గత కొంతకాలంగా గొడవ చేస్తోంది.

ఈ క్రమంలో ఓ సీరియల్ నటితో మధుప్రకాశ్ చనువుగా ఉండడంతో వారి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ విషయాన్ని భారతి పలుమార్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. సోమవారం రాత్రి కూడా ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మధుప్రకాశ్ ఇదేమీ పట్టించుకోకుండా మంగళవారం ఉదయం జిమ్‌కు వెళ్తున్నట్టు చెప్పి అటునుంచి అటే షూటింగ్‌కు వెళ్లిపోయాడు.

మధ్యలో ఒకసారి భారతి వీడియో కాల్‌ చేసి తాను ఉరేసుకుంటున్నట్లు బెదిరించింది. అయితే, దానిని సీరియస్‌గా తీసుకోని మధుప్రకాశ్ రాత్రి ఇంటికి వచ్చాడు. బెడ్‌రూము తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో బలవంతంగా తలుపుతెరిచి చూసి విస్తుపోయాడు. భారతి చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది.

షాక్ నుంచి తేరుకుని మధుప్రకాశ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.