ఓటేసిన సినీ ప్రముఖులు.. క్యూలో ఓపిగ్గా ఎన్టీఆర్

11:04 am, Thu, 11 April 19

హైదరాబాద్: దేశవ్యాప్తంగా తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో ఓటర్లు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇక హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌లలోని పోలింగ్ కేంద్రాలు సెలబ్రిటీలతో సందడి చేశాయి.

ఓటేసేందుకు వచ్చిన అభిమాన తారలను చూసి అభిమానులు పులకించిపోయారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ తన తల్లి, భార్యతో కలిసి జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూలో నిల్చున్నాడు. తమ వంతు వచ్చే వరకు ఓపిగ్గా నిల్చుని అనంతరం ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోయాడు. తమతోపాటు నిల్చున్న ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. మరో హీరో అల్లు అర్జున్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఎన్టీఆర్ ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.