ప్రభాస్ సినిమా సాహో పోస్టర్ కడుతుండగా విద్యుత్ షాక్.. కుప్పకూలిన అభిమాని

7:34 am, Thu, 29 August 19

మహబూబ్‌నగర్:  పాలమూరులో విషాదం నెలకొంది. టాలీవుడ్ నటుడు ప్రభాస్ నటించిన సాహో సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్ వద్ద సినిమా బ్యానర్‌ కడుతూ ఓ అభిమాని కరెంట్ షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు.

మహబూబ్‌నగర్‌లోని స్థానిక తిరుమల థియేటర్ వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రభాస్ అభిమాని అయిన బోయపల్లి ప్రాంతానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు థియేటర్ ఆవరణలో ఫ్లెక్సీ కడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తాకడంతో విద్యుదాఘాతానికి థియేటర్ రెండో అంతస్తు నుంచి కింద పడ్డాడు.

కాళ్లు విరిగిపోయి విలవిల్లాడాడు. వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. థియేటర్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.