రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ‘ఆఫీసర్’ సినిమా తెలుగు సినీ ప్రేక్షకులను, అక్కినేని అభిమానులను తీవ్ర నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందంటూ మొదటి నుంచీ నెగిటివ్ రివ్యూలను ఎదుర్కొంది.
ప్రత్యేకించి రామ్ గోపాల్ వర్మ హిట్ ఇచ్చి చాలా కాలం అయిపోవడంతో ఈ సినిమాపై అంచనాలు తక్కువగానే ఉన్నాయి. సినిమాల కన్నా ఇతర వ్యవహారాలతో వర్మ బిజీగా ఉండటంతో నాగార్జున వంటి స్టార్ నటించినప్పటికీ సహజంగానే ‘ఆఫీసర్’పై పాజిటివ్ అంచనాలు లేకుండా పోయాయి, అందుకు తగ్గట్టుగా విడుదలైన రోజునే సినిమా ఫ్లాప్ అనే టాక్ బయటికొచ్చింది.
ఎలాగంటే… ‘ఆఫీసర్’ సినిమాను ప్రీ రిలీజ్ వ్యాపారంలో దాదాపు రూ.20 కోట్ల స్థాయిలో అమ్మినట్లు సమాచారం. ఇందులో ప్రధానమైనవి డిజిటల్, టీవీ రైట్సే. వీటితో పాటు డబ్బింగ్ రైట్స్ కలిపి దాదాపు రూ.12 కోట్లకు మార్కెట్ చేసుకున్నారట. ఇక డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా దాదాపు ఏడెనిమిది కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విడుదల తర్వాత ‘ఆఫీసర్’ పెద్ద డిజాస్టర్‌గా పేరు తెచ్చుకోవడంతో ఈ సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏమోగానీ.. ఇటు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన మరో వ్యక్తి మాత్రం సేఫ్ అయ్యారని టాక్.
ఈ సినిమాను తక్కువ మొత్తంలోనే నిర్మించారట. సాధారణంగా హీరో నాగార్జున ఐదు కోట్ల రూపాయల పారితోషికం తీసుకొంటాడట, అయితే ఈ సినిమాను వర్మ తీయడంతో ఆయన కోసం మూడు కోట్ల రూపాయలకే ఈ సినిమాను చేసినట్టుగా సమాచారం. ఇక మిగిలిన చిత్రీకరణ మొత్తాన్నీ ఆరేడు కోట్ల రూపాయలతో ముంగించేశారట. ఈ రకంగా చూస్తే… సినిమా మొత్తం బడ్జెట్ పది కోట్ల రూపాయలకు మించలేదని సమాచారం.
మరోవైపు అన్ని రకాల రైట్స్‌తో ఈ సినిమా ద్వారా రూ.20 కోట్లు వచ్చాయని, ఫలితంగా దర్శకుడు వర్మ, ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన మరో వ్యక్తి బాగానే లాభపడ్డారని సమాచారం. డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను కూడా తక్కువ ధరకే అమ్మినప్పటికీ.. కనీసం డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వారికొస్తుందా? అనేది మాత్రం డౌటే!