రాంగోపాల్ వర్మ మరో కాంట్రవర్సీ..‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ సాంగ్ విడుదల

11:20 am, Fri, 9 August 19

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో కాంట్రవర్సీతో ముందుకొచ్చాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన వర్మ తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మరో సినిమాకు రెడీ అయ్యారు. ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను ఈ ఉదయం 9 గంటలకు విడుదల చేశాడు.

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో వివాదానికి తావుండదని ట్వీట్ చేసిన వర్మ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద ఒట్టు వేశారు. అయితే, పాట చూశాక అభిమానులు కొంత అయోమయానికి గురయ్యారు. కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు వచ్చిన తర్వాత అంటూ తొలుత పాట మొదలైంది.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అను నేను..

ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను..’తో ప్రారంభమయ్యే ఈ పాట శ్రోతల్లో ఆసక్తి పెంచేలా ఉంది. అసెంబ్లీలో జరిగిన వాదనలను చూపిస్తూ కత్తులు లేవిపుడు.. చిందే నెత్తురు లేదిపుడు.. అంటూ పాటను పీక్ స్టేజీకి తీసుకెళ్లాడు.

ఏపీలో యుద్ధం చేసే పద్ధతి మారిందని, ఇది కొత్త యుద్ధం అని, మాధ్యమమే ప్రధానమని, నడిచే చట్టమే ఆయుధమని పదునైన పదాలను ఈ పాటలో జోడించాడు. నవ్వుతూ వేసే ఎత్తుగడ, ప్రత్యర్థులకు గుండె దడ.. అని ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన వాదనలను జోడిస్తూ పాటను రక్తి కట్టించాడు.

మెంటల్ టార్చర్ పెట్టి లాగుతారు కూపీ.. దొంగలంతా బెదిరి శరణు వేడుతారు.. తదితర పదాలు మరో రాజకీయ కోణాన్ని ఎత్తి చూపాడు. కాంట్రవర్సీ జోలికే పోనన్న వర్మ ఈ పాటలో వివాదమయ్యే రాజకీయ కోణాన్నే ఎంచుకున్నాడు. నిజ జీవితంలోని పాత్రలను పాటలో చూపించడం కొత్త వివాదానికి తెరతీస్తుందనడంలో సందేహం లేదు.