సినీ గేయ రచయిత కులశేఖర్‌కు ఎందుకీ దుస్థితి? ఆయన సహాధ్యాయి, మిత్రుడు ఏమంటున్నారంటే…

kulasekhar
- Advertisement -

ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్ ఇటీవల దొంగతనం కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కులశేఖర్‌కు సంబంధించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. బ్రాహ్మణులంటే అతడికి ద్వేషమని, అందుకే గుళ్లలో పథకం ప్రకారం దొంగతనాలు చేస్తున్నాడని.. ఇలా పలు కథనాలు వెలువడుతున్నాయి.

అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అని, కులశేఖర్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడని, అతడికి తక్షణం వైద్యం అందాల్సిన అవసరం ఉందని కులశేఖర్ సన్నిహితుడు, సహాధ్యాయి, సీనియర్ పాత్రికేయుడు కోవెల సంతోష్ కుమార్ అంటున్నారు. కులశేఖర్ జీవితంలో.. ఈనాడు జర్నలిజం స్కూలులో శిక్షణ, సినిమాలు, తర్వాత ఎదురైన ఒడిదొడుకులను సంతోష్ ఇలా వివరించారు.

ప్రచారంలో.. తప్పుడు సమాచారం…

కులశేఖర్ విషయంలో ప్రచారమవుతున్నదంతా చాలా చాలా తప్పుడు సమాచారం. పత్రికల్లో వచ్చిన వార్తలు ఆయనను మరింత కించపరిచేలా ఉన్నాయి. నేను కులశేఖర్‌తో సహవాసం చేసిన వాడిని. నాకు తమ్ముడిలాంటివాడు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ 1996-97 బ్యాచ్‌లో చదివిన నాటినుంచి నాకు అత్యంత సన్నిహితుడు. జర్నలిజం స్కూల్ అనంతరం ఈనాడు సెంట్రల్ డెస్క్‌లో.. ఆ తర్వాత.. ఢిల్లీ ఈటీవీలో కలిసి పనిచేశాం. మా బ్యాచ్‌లో నేను మొదటి ర్యాంకు కాగా, కులశేఖర్, గోపాల రమేశ్ రెండు మూడు ర్యాంకుల్లో నిలిచారు.

ఆయన గుళ్లో పూజారి కాదు…

వార్తల్లో పేర్కొంటున్నట్లు కులశేఖర్ తండ్రిగారు గుళ్లో పూజారి కారు. ఆయన యావత్ తెలుగు వారు గర్వించదగ్గ సంస్కృత పండితులు కవి పండిత బిరుదాంకితులు.. మహామహోపాధ్యాయ ఎస్‌టీపీ రామచంద్రాచార్యులు గారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామివారికి కూడా ఒక విధంగా గురుస్థానంలో ఉన్నవారు. భక్తి నివేదన సంచికకు దశాబ్దాల పాటు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించినవారు. విశిష్టాద్వైత సంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చినవారు. ఆయన కుమారుల్లో ఒకరు కులశేఖర్. ఇతనికీ సంస్కృతంలో మంచి ప్రావీణ్యం ఉన్నది.

కులశేఖర్ మేధావి…

ఈనాడు జర్నలిజం స్కూలులో ఉన్నప్పుడే కులశేఖర్ సరళమైన.. అలతి అలతి పదాలతో రామాయణాన్ని తెలుగులో కవిత్వీకరించాడు. ఆ తర్వాత చలన చిత్ర సీమకు గేయరచయితగా వెళ్లిన తర్వాత ‘చిత్రం’ సినిమాలో ఒక పాటలో మొత్తం రామాయణాన్ని కథారూపంలో చెప్పిన మేధావి. సిరివెన్నెల సీతారామశాస్త్రి శిష్యుడిగా సినిమా రంగంలో ప్రస్థానం ప్రారంభించిన కులశేఖర్.. అత్యంత వేగంగా ఎదిగాడు. వందకుపైగా సినిమాలకు అద్భుతమైన పాటలను అందించాడు. కొన్ని సినిమాలకు మాటలూ రాశాడు. ఒక సినిమాకు దర్శకత్వం వహించాడు.

సినీరంగంలో ఉన్నప్పుడే…

అయితే సినిమారంగంలో ఉన్న కాలంలోనే ఆ రంగంలోని జాడ్యాలు.. సహజంగానే కులశేఖర్‌కు అంటుకున్నాయి. అవి క్రమంగా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీశాయి. మానసికంగా తీవ్రంగా కుంగదీశాయి. ఒక దశలో ఆయన్ని రక్షించుకోవడమే కష్టమైన పరిస్థితి. హైదరాబాద్ నుంచి కొన్నాళ్లపాటు విశాఖపట్నం తీసుకెళ్లారు. అక్కడ వైద్య చికిత్స తీసుకోవడం వల్ల ఆయన ఆరోగ్యం చాలావరకు కుదుటపడింది.

అయితే సినిమేనియా ఆయన్ను తిరిగి హైదరాబాద్‌కు తరుముకొని తీసుకొచ్చింది. కానీ.. ఆయన మానసిక స్థితి సమతుల్యం కాలేదు. అప్పటికే సినిమాకు దూరమైన ఆయనకు తిరిగి ప్రవేశించే అవకాశం లభించలేదు. దీంతో ఆయన మానసిక ప్రవృత్తి పూర్తిగా విచలితమైంది. అలా విచలితమైన పరిస్థితిలో భార్య, కుటుంబసభ్యులు ఆయన్ను వదిలి వెళ్లటం దురదృష్టకరం. ఈ దశలోనే ఆయన ఏదోరకంగా పూట గడిచేందుకు గత్యంతరం లేక ఈ రకమైన దారులను వెతుక్కొని ఉండవచ్చు.

బాగున్నట్టు కనపడతాడు కానీ, అంతలోనే…

కాకినాడ ఘటన జరిగినప్పుడు కూడా ఆయన్ను కాపాడటానికి మా సహచరుడు రమణమూర్తి శతథా, సహస్రథా ప్రయత్నించాడు. కానీ.. ఆయన మన లోకంలోనే లేడు. అప్పుడే బాగా ఉన్నట్టు కనపడతాడు.. కానీ, అంతలోనే స్వభావంలో మార్పు వస్తుంది. స్వతహాగా కులశేఖర్ మంచివాడు. మానసికంగా.. ఆయన మేధకు కలిగిన రుగ్మత కారణంగానే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఆయనకు ఇప్పుడు మానసిక వైద్యం అత్యంత అవసరం.

వైద్య సహాయం అందిస్తే…

జైల్లోనే ఉన్నప్పటికీ.. ఆయనకు వైద్య సహాయం అందిస్తే తప్పక మనలోకంలోకి వస్తాడు. తిరిగి పాత కులశేఖర్‌ను చూసే అవకాశం లభిస్తుందని నా ఆశ. ఆయనపై ఇలాంటి వార్తలు చూసినప్పుడు ఎనలేని దు:ఖం పొంగుకొస్తున్నది. బ్రాహ్మణులు వెలివేశారని, పూజారులపై ద్వేషం ఉన్నదని.. రాయడం దారుణంగా అనిపిస్తుంది. ఇవన్నీ పొరపాటుగా రాసిన.. అన్న మాటలని అంతా గుర్తించాలి. మనం ఇంతమందిమి మీడియాలో ఉన్నాం. ఆయనపై సానుభూతి చూపించి చేతులు దులుపుకోవడం కంటే… ఆయనకు చికిత్సనందించే మార్గాన్ని అన్వేషించాలని అందరినీ వినమ్రంగా ప్రార్థిస్తున్నా..

కులశేఖర్ ప్రస్తుతం చంచల్‌గూడ రిమాండ్‌లో ఉన్నారు. ఆయన్ని అక్కడి నుంచి బయటకు తీసుకురావడం కంటే.. అక్కడికే వైద్య నిపుణుడిని పంపించడం ద్వారా చికిత్సనందించే ప్రయత్నానికి పెద్దవారు పూనుకోవాలని వినతి. ఒక గొప్ప మేధావిని రక్షించుకొనేందుకు మీవంతుగా కృషి చేయాలని కోరుతున్నా…

– కోవెల సంతోష్ కుమార్

- Advertisement -