తమిళ నటి వరలక్ష్మిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు విమల్

7:23 am, Wed, 14 August 19

చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్‌పై నటుడు విమల్ నోరు పారేసుకున్నాడు. ఆమెను ఓ మగాడిగా పేర్కొని వివాదానికి తెరలేపాడు. తాను తొలిసారి ఓ మగాడితో నటించానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. విమల్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ముత్తుకుమారన్ దర్శకత్వంలో రూపొందించిన ‘కాన్ని రాశి’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.

సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా విమల్, వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా విమల్ మాట్లాడుతూ.. తాను తొలిసారి ఓ మగాడికి జోడీగా నటించానని చెప్పుకొచ్చాడు. ఆ వెంటనే తేరుకుని తన ఉద్దేశం అది కాదని, ఆమెతో కలిసి పనిచేయడంలో తాను ఎటువంటి ఇబ్బందికి గురికాలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఆమె చాలా సహజంగా నటిస్తుందని, ఆమె తన పాత్రలో లీనమైపోతారని విమల్ పేర్కొన్నాడు.

వరలక్ష్మి తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. తాను ప్రేమ పెళ్లి చేసుకుంటానా? లేక, పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటానా? అనేది సమస్య కాదని, తనకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదని తేల్చి చెప్పింది.