నా వల్ల పాత్రకు చెడ్డపేరు రాకూడదని అలా చేశా: కీర్తి సురేశ్

1:08 pm, Sun, 11 August 19

హైదరాబాద్: కీర్తి సురేశ్.. ఇప్పుడీ పేరు జాతీయ మీడియాలో మారుమోగిపోతోంది. మహానటి సినిమాతో ఆమె పేరు చిత్రసీమలో మారుమోగుతోంది. ఈ సినిమాకు గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. నేను శైలజా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్.. మలయాళంలోనూ కొన్ని సినిమాలు చేసింది.

అయితే, ఆమెకు మంచి గుర్తింపు లభించింది మాత్రం తెలుగులోనే. ‘నేను శైలజ’ తరువాత పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’లో చేసినా కలిసిరాలేదు. అదే సమయంలో అనుకోకుండా ‘మహానటి’ ఆఫర్ వచ్చింది. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి సినిమా అంటే మామూలు చేయడం అంటే కత్తిమీద సామే. అయినప్పటికీ ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసింది.

అయితే, ఆ తర్వాత పదిరోజులపాటు ఎలా చేయాలా? అని ఆలోచించిందట. మహానటి సావిత్రి పాత్రను చేయడమంటే మామూలు విషయం కాదని అనుకుందట. ప్రతి సన్నివేశాన్ని ఒకటికి నాలుగు రోజులు ప్రాక్టీస్ చేసుకుని నటించిందట. తన వల్ల పాత్రకు చెడ్డపేరు రాకూడదనే కష్టపడి చేసినట్టు కీర్తి సురేష్ ఇటీవల చెప్పుకొచ్చింది.

సినిమా షూటింగ్ మరో 10 రోజుల్లో పూర్తవుతుందని తెలిసినప్పటి నుంచి మనసులో తెలియని బాధ ఉందని, సినిమా పూర్తయ్యాక ఏడ్చేశానని చెప్పింది. ఇప్పటి వరకు తన కెరియర్లో మహానటి సినిమా చాలా సంతృప్తిని ఇచ్చిందని పేర్కొంది. ఇకపై మరో బయోపిక్ సినిమా చేయబోనని కీర్తి సురేశ్ తేల్చి చెప్పింది.