టీడీపీ యాడ్స్ ద్వారా బోయపాటి ఎంత సంపాదించారో తెలుసా?

12:51 pm, Mon, 15 April 19
boyapatisreenu

హైదరాబాద్: ఎలక్షన్ వస్తే మాకేంటి అని అడగొద్దు. ఎలక్షన్ కొందరికి కాసుల కలశం లాంటిది. దండుకునే వాళ్లకు దండుకున్నంత. ఈసారి ఎన్నికల్లో క్యాంపెయినర్లుగా ఉన్న స్టార్లు, ప్రకటనలకు పని చేసిన యాడ్స్ డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు.. ఇలా అందరూ తలో పిడికెడు సంపాదించుకున్నారని తెలుస్తోంది.

అవకాశం వచ్చినప్పుడే నాలుగు కాసులు వెనకేసుకోవాలన్న సూత్రాన్ని తూ.చ. తప్పక పాటించి లాభపడ్డారట. తెలుగు దేశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనల కోసం ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీ అధినాయకుల్ని గెలిపించాల్సిందిగా ప్రాధేయపడుతూ రూపొందించిన ప్రకటనలు బుల్లితెరపై సందడి చేస్తున్నాయి.

టీడీపీ ప్రకటనలపైనే సర్వత్రా చర్చ…

అయితే వీటిలో టీడీపీ ప్రకటనలు సమ్‌థింగ్ స్పెషల్ అన్న చర్చ జనంలో సాగుతోంది. బోయపాటి మార్క్ మాస్ మసాలాతో అలరిస్తున్నాయని కొందరు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు తెలుగు దేశం ప్రకటనల్లో మొనాటనీ కామెడీకి టీవీల ముందు జనం పగలబడి నవ్వుతున్నారు.

వాట్ ఏ క్రియేటివిటీ అంటూ సామాజిక మాధ్యమాల్లో టీడీపీ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. అదంతా అటుంచితే.. ఇన్ని రకాల వెర్షన్లలో ప్రకటనలు రూపొందించిన బోయపాటి శ్రీను తన పారితోషికంగా ఎంత పుచ్చుకున్నారు? అంటే .. ఏకంగా రూ.4.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని తెలిసింది.

అయితే ప్రకటనల రూపకల్పన కోసం బోయపాటి గత కొన్ని నెలలుగా ఎంతగా శ్రమించారో చూస్తున్నదే. ప్రకటనల్లో రకరకాల స్కీమ్‌ల గురించి టీడీపీని హైలైట్ చేస్తూ డిజిటల్ మీడియాలోనూ చక్కగానే ఎలివేట్ చేశారాయన.

తరువాత ఏంటి?

మరి ఎన్నికలు అయిపోయాయి కదా? మరి బోయపాటి తదుపరి ఏం చేయబోతున్నారు? అనే విషయానికొస్తే.. అందుకు కూడా సమాధానం రెడీగా ఉంది. టీడీపీ నాయకుడు.. నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ మాస్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు బోయపాటి శ్రీను ప్రస్తుతం రెడీ అవుతున్నారట.

దీనికి సంబంధించిన స్క్రిప్టు పనుల్లో మెజారిటీ పార్ట్ ఇప్పటికే పూర్తి చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. మరిన్ని వివరాలు ఎన్నికల ఫలితాల తర్వాత వెల్లడిస్తారట. అయితే బోయపాటి ఆ మధ్య తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే!