10 కోట్లు ఇస్తానన్నా ప్రచారం చేయను పొమ్మన్న నటి శిల్పాశెట్టి

10:51 am, Sun, 18 August 19

ముంబై: రూ.10 కోట్ల యాడ్‌ను తృణప్రాయంగా వదిలేసిన శిల్పాశెట్టి.. శభాష్ అంటున్న అభిమానులు!
పది కోట్ల రూపాయల ఆఫర్‌ను బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తృణప్రాయంగా వదిలేసుకుంది. విషయం తెలిసిన ఆమె అభిమానులు శభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇటీవల ఓ ఆయుర్వేద సంస్థ శిల్పాశెట్టిని సంప్రదించింది.

తాము ఉత్పత్తి చేసే ‘స్లిమ్మింగ్ పిల్’‌కు ప్రచారకర్తగా ఉండాలని కోరింది. ఇందుకు సంబంధించిన ప్రకటనలో నటించాలంటూ పది కోట్ల రూపాయలను ఆఫర్ చేసింది. అయితే, భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నా శిల్ప మాత్రం నో చెప్పేసింది. ‘స్లిమ్మింగ్ పిల్స్’కు తాను ప్రచారం చేయలేనని, వేరే వారిని చూసుకోవాలని నిక్చచ్చిగా చెప్పడంతో వారు విస్తుపోయినట్టు తెలిసింది.

ఆ స్లిమ్మింగ్ పిల్‌ను వేసుకుంటే ఎటువంటి వ్యాయామాలు లేకుండానే పొట్టలోని కొవ్వు కరిగిపోయి సన్నగా, నాజూగ్గా తయారవుతారని చెప్పడమే ఆ ప్రకటన ఉద్దేశం.

ఆఫర్‌ను వదులుకోవడంపై శిల్ప మాట్లాడుతూ.. తనకు నమ్మకం లేని దాని గురించి తాను ప్రచారం చేయలేనని పేర్కొంది. తాను నమ్మని వస్తువును మరొకరితో కొనిపించలేనని చెప్పింది. ‘‘ఆ పిల్ వేసుకుంటే తక్షణం ఫలితం కనిపిస్తుందని చెప్పడం ద్వారా ఆకర్షించవచ్చు. కానీ, నిత్య జీవితంలో ఆహార హక్కుకు కట్టుబడి ఉండడం కూడా గర్వకారణమే. దీనిని మరేదీ అధిగమించలేదు’’ అని శిల్ప చెప్పుకొచ్చింది.