పీవీ సింధుపై బాలీవుడ్‌లో సినిమా?

8:26 pm, Tue, 27 August 19

ముంబై: తెలుగుతేజం, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు జీవితం ఆధారంగా ఓ సినిమాను రూపొందించేందుకు బాలీవుడ్‌లో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. సింధు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్‌ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అక్షయ్ కుమార్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఇటీవల గోపీచంద్‌కు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అంతేకాదు, పీవీ సింధు బయోపిక్‌లో తన పాత్రలో అక్షయ్ నటిస్తే బాగుంటుందని చెప్పడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. అయితే, బయోపిక్‌పై తనకు పూర్తి సమాచారం లేదని పేర్కొన్నాడు.

ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌‌షిప్‌లో సింధు అద్వితీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలవడంలో రెండుసార్లు విఫలమైన సింధు.. మూడోసారి తన కలను సాకారం చేసుకుంది. జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరను చిత్తుగా ఓడించి విజయబావుటా ఎగురవేసింది. ఫలితంగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించింది.