సైబర్ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన పూనమ్‌ కౌర్‌.. 50 యూట్యూబ్ ఛానల్స్‌పై ఫిర్యాదు!

6:59 pm, Tue, 16 April 19
actress-poonam-kaur-complained-on50-youtube-channels

హైదరాబాద్: అసభ్యకరమైన పోస్టులు, వీడియోలతో.. సోషల్‌ మీడియాలో తనపై అసత్యా ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లకు నటి పూనమ్‌ కౌర్‌ పెద్ద ఝలక్ ఇచ్చారు. మంగళవారం సైబర్‌ సెల్‌కు వచ్చిన ఆమె అక్కడి అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.

లేనిపోని పుకార్లు పుట్టించి.. వ్యాపింపజేస్తూ కొంతమంది సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అభ్యర్థించారు.

వీడియో షేరింగ్‌ వెబ్‌సైట్‌ యూట్యూబ్‌లో కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై అసభ్యకరమైన వీడియోలు పోస్టు చేస్తున్నారని తన లిఖితపూర్వక ఫిర్యాదులో పూనమ్ కౌర్ పేర్కొన్నారు. తనను కించపరిచేవిధంగా, తన వ్యక్తిత్వాన్ని అవమానించేలా కొంతమంది యూట్యూబ్‌లో పోస్టులు పెడుతున్నారని చెప్పారు, సోషల్‌ మీడియాలోనూ తనపై దుష్ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా పూనమ్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ.. అసలు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదన్నారు. రెండేళ్లుగా కొంతమంది యూట్యూబ్‌లో తన పేరుతో వీడియో లింక్స్ పెడుతూ.. మానసిక వేదనకు గురి చేస్తున్నారని, ఈ విషయమై తాను ఫిర్యాదు చేయడానికి వచ్చానని తెలిపారు.

సుమారు 50 యూట్యూబ్ ఛానల్స్‌పై ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.