మహానటి సావిత్రి నిజజీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా చిత్రం ఘన విజయం సాధించడం పట్ల సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు.
‘‘చిన్నతనం నుంచి అగ్రనటిగా అమ్మ ఎదిగిన తీరును ఈ సినిమా ద్వారా చూడగలిగాను.. తన పాత్ర కోసం కీర్తి సురేష్‌ను స్వయంగా అమ్మే ఎంచుకుందని అనిపిస్తోంది..’’ అని వ్యాఖ్యానించారు. తన తల్లి జీవిత చరిత్రను వెండితెరకెక్కించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
తన తల్లి మరణానికి కారణం డయాబెటిక్ కోమా అని సావిత్రి కుమార్తె చాముండేశ్వరి చెప్పారు. తన తల్లికి ఎప్పటి నుండో డయాబెటిస్ ఉందని, దాంతో పాటు కోమాలోకి వెళ్లడంతో 19 నెలలు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందని, ఆమెను కోమా నుండి బయటకు తీసుకురావాలని డాక్టర్లు చాలా ప్రయత్నాలు చేశారని, కానీ సాధ్యం కాలేదని ఆమె వివరించారు. ‘‘కోమాలోకి ఎందుకు వెళ్లింది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే వివరాలు మహానటి సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్స్ ఏమిటి అని నేను చెప్పలేను. సినిమాలో చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది..’’ అని విజయ చాముండేశ్వరి తెలిపారు.
సావిత్రి అల్లుడు గోవింద్ మాట్లాడుతూ, సావిత్రిని మించిన నటి లేదని అందరూ అంటుంటారని… సావిత్రిని మించిన నటి రావాలని తాను అనుకుంటూ ఉంటానని చెప్పారు. ‘మహానటి’ చిత్రం ద్వారా తన కోరిక వాస్తవరూపం దాల్చిందని, సావిత్రిని మించి కీర్తి సురేష్ నటించిందని తెలిపారు. సావిత్రి జీవిత చరిత్రతో సినిమా రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు.