తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

- Advertisement -

న్యూఢిల్లీ: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది.

51వ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఆయనకు ఇస్తున్నట్టు ఈ రోజు ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అయితే, తమిళనాడు ఎన్నికలకు ముందు అవార్డు ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఈ నెల 6న తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ఇస్తూ వస్తోంది. సినీ రంగంపై తనదైన ముద్ర వేసిన రజనీకాంత్‌కు ఈసారి ఆ అవార్డు లభించింది.

రజనీకాంత్ 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు. రజనీకాంత్‌కు ఈ అవార్డు రావడంపై ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌ ఈ అవార్డు అందుకున్నారు. అలాగే, దక్షిణాది విషయానికి వస్తే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు), ఎల్వీ ప్రసాద్ (తెలుగు), నాగిరెడ్డి (తెలుగు), అక్కినేని నాగేశ్వరరావు (తెలుగు), శివాజీ గణేశన్ (తమిళం), రాజ్‌కుమార్ (కన్నడ), గోపాలకృష్ణన్ (మలయాళం), రామానాయుడు (తెలుగు) బాలచందర్ (తెలుగు, తమిళం), కె.విశ్వనాథ్ (తెలుగు) తదితరులు దాదాసాహెబ్ పురస్కారాన్ని అందుకున్నారు.

- Advertisement -